విద్యార్థి మృతిపై వామపక్ష విద్యార్థి సంఘాల ఆందోళన
వార్డెన్, సంబంధిత అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్
మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి
ప్రజాపక్షం/ఖమ్మం : సంక్షేమ వసతి గృహాలు విద్యార్థులకు చదువుల నిలయాలుగా ఉండాలి కానీ, విద్యార్థుల ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు నెలకొనడం ఆందోళనకరమని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. ఖమ్మం గాంధీచౌక్‌లోని బీసీ సంక్షేమ వసతి గృహంలో ఉంటూ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అజయ్ మృతి ఘటనకు బాధ్యులైన వార్డెన్, సంబంధిత అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి మృతిని నిరసిస్తూ శనివారం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ ఎదుట ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ తదితర వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇటికాల రామకృష్ణ మాట్లాడుతూ.. రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థి ఆరోగ్య పరిస్థితిపై వసతి గృహం నిర్వాహకులు తగిన శ్రద్ధ చూపకపోవడమే ఈ ఘటనకు కారణమని ఆరోపించారు. విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని ముందుగానే గుర్తించి మెరుగైన వైద్యం అందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. స్థానిక ఏఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అజయ్ శుక్రవారం మధ్యాహ్నం వసతి గృహంలోని మరుగుదొడ్డికి వెళ్లి అక్కడే కుప్పకూలిపోయాడు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తోటి విద్యార్థులు వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. సంక్షేమ వసతి గృహాల్లో ప్రతినెలా వైద్య శిబిరాలు నిర్వహించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. హాస్టళ్లలో మానసిక ఆరోగ్య నిపుణులను కూడా అందుబాటులో ఉంచాలని కోరారు. జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే సంక్షేమ వసతి గృహాలను తనిఖీ చేసి, విద్యార్థులకు అందుతున్న వసతులు, వైద్య సేవలపై సమగ్ర పరిశీలన జరపాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోని పక్షంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్, జిల్లా కార్యదర్శి బూర మనోజ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తుడుం ప్రవీణ్, పీడీఎస్‌యూ నాయకులు మస్తాన్, లక్ష్మణ్, ఐసా జిల్లా నాయకులు జమ్మి అశోక్, జాజిరెడ్డి, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు మంద సురేష్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి