ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: వర్షాకాలం ముగింపు దశకు చేరుకున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఖమ్మం రూరల్ మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో నీటి నిల్వలపై ఆందోళన నెలకొంటోంది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ వర్షపాతం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరుల్లోకి చేరాల్సినంత నీరు చేరలేదనే పరిస్థితి కనిపిస్తోంది.
గత ఏడాదితో పోలిస్తే భారీ తేడా
గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఖమ్మం జిల్లాలో వర్షపాతం గణనీయంగా తగ్గింది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 29 వరకు 2026లో ఖమ్మం జిల్లా కేంద్రంలో 421 మి.మీ. వర్షపాతం నమోదుకాగా, గత ఏడాది ఇదే కాలంలో 740 మి.మీ. వర్షం కురిసింది. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈసారి దాదాపు 43 శాతం వర్షపాతం తగ్గింది. ఈ లోటు నీటి వనరులపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణంగా వర్షాకాలంలో కురిసిన వర్షాలతో చెరువులు, కుంటలు నిండటంతో పాటు భూగర్భ జలాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఆ నీటి నిల్వలే అనంతరం వచ్చే వేసవి నెలల్లో తాగునీరు, సాగునీటి అవసరాలకు కొంతవరకు ఆధారంగా నిలుస్తాయి. అయితే ఈసారి ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు ఏర్పడకపోతే వచ్చే వేసవిలో నీటి అవసరాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
అధికారుల ముందస్తు చర్యలే కీలకం
ఈ నేపథ్యంలో ఎదులాపురం మున్సిపాలిటీతో పాటు ఖమ్మం రూరల్ మండలంలో అధికారులు నీటి వనరుల ప్రస్తుత పరిస్థితిపై సమగ్రంగా అంచనా వేయాల్సిన అవసరం ఉంది. చెరువులు, కుంటల్లో ప్రస్తుతం ఎంత నీరు ఉంది? భూగర్భ జలాల పరిస్థితి ఎలా ఉంది? వచ్చే వేసవిలో తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు? అనే అంశాలు ఇప్పుడు కీలకంగా మారాయి. వర్షాలు తగ్గినప్పుడే అప్రమత్తమవడం కాకుండా.. వేసవి వచ్చేలోపే నీటి నిల్వలు, తాగునీటి సరఫరా, ప్రత్యామ్నాయ వనరులపై అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తేనే భవిష్యత్ నీటి సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ప్రస్తుత వర్షపాత లోటు నేపథ్యంలో అధికారులు ఎలాంటి ముందస్తు చర్యలు చేపడతారో వేచి చూడాల్సి ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి