రైతులకు మండల వ్యవసాయ అధికారి జె. ఉమా నాగేష్ సూచన
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: యాసంగి సీజన్‌లో వరి సాగుకు బదులుగా తక్కువ నీటి వినియోగంతో పండే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని మండల వ్యవసాయ అధికారి జె. ఉమా నాగేష్ రైతులకు సూచించారు. ఖమ్మం రూరల్ మండలంలోని పొలిశెట్టిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో శుక్రవారం రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యాసంగిలో వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి, నీటి లభ్యత, నేల స్వభావానికి అనుగుణంగా పెసర, మినుము, నువ్వులు, కుసుమ వంటి తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని సూచించారు. తక్కువ కాల పరిమితి కలిగిన ప్రత్యామ్నాయ పంటల సాగుతో నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేయించుకోవాలని సూచించారు. సమీపంలోని మీ-సేవ కేంద్రం లేదా వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జె. ఉమా నాగేష్, వ్యవసాయ విస్తరణ అధికారి ఎం. శ్రీకావ్య, గ్రామ రైతులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి