ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

దయోస్తే ఉప్పెన..జనంతో మమేకం


 

మామ అడుగులో అడుగు..పొంగులేటికి నమ్మిన బంటు..


తెరవెనుక కీలక పాత్ర.. ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు!


ఫోన్ మోగితే స్పందన... సమన్వయంలో దిట్ట


ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: సినీ హీరోలకైనా.. క్రికెట్ దిగ్గజాలకైనా.. రాజకీయ రంగంలో అగ్రనేతలకైనా అభిమానగణం ఉండటం సహజం. వారి వెంట నడిచేవారు, వారి మాటను అభిమానించేవారు లక్షల్లో ఉంటారు. కానీ ఒక నాయకుడి ఆలోచనను తన బాధ్యతగా మలుచుకుని, ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, ప్రజలకు, ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య వారధిగా నిలుస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం మాత్రం అంత తేలికైన విషయం కాదు. కానీ సమన్వయమే తన వ్యూహం.. ప్రజలతో మమేకం కావడమే తన పనితీరుగా ముందుకు సాగుతున్న తుంబూరు దయాకర్ రెడ్డి ఇప్పుడు రాజకీయ, ప్రజా వర్గాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. అందుకే ఆయన పేరును ప్రస్తావిస్తూ.. దయోస్తే ఉప్పెనే! అంటూ పలువురు చర్చించుకుంటున్నారు.


మామ అడుగులో అడుగు..


రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుండగా.. ఆయన క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జిగా  దయాకర్ రెడ్డి తెరవెనుక కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మంత్రికి సంబంధించిన కార్యక్రమాల సమన్వయం ఒకవైపు.. ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు మరోవైపు.. పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిరంతర సంప్రదింపులు ఇంకోవైపు.. ఇలా అనేక బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. పాలేరు నియోజకవర్గానికే పరిమితం కాకుండా ఖమ్మం జిల్లా నలుమూలల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మంత్రి అభిమానులు, వివిధ సమస్యలతో వచ్చే ప్రజలు ఆయనను సంప్రదిస్తుంటారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా తమ మాట వినే వ్యక్తి ఉన్నారనే నమ్మకంతో ఆయనను ఆశ్రయిస్తుంటారు. సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడటం, పనుల పురోగతిని తెలుసుకోవడం, అవసరమైన చోట మళ్లీ సంప్రదించడం వంటి వ్యవహారాల్లో ఆయన నిరంతరం నిమగ్నమై ఉంటారు. ఒక ఫోన్ కాల్ వెనుక ఒకరి అవసరం.. మరో కాల్ వెనుక ఒక కుటుంబం ఆశ.. ఇంకో విజ్ఞప్తి వెనుక ఒక ప్రాంత సమస్య.. ఇలా ప్రతి సంప్రదింపునూ ఒక బాధ్యతగా తీసుకోవాల్సిన పరిస్థితి ఆయన రోజువారీ జీవితంలో కనిపిస్తుంది.


ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు.. ఫోన్‌తోనే సహవాసం!


సాధారణంగా చాలామందికి రోజులో కొంత సమయం వ్యక్తిగత అవసరాల కోసం ఉంటుంది. కానీ ప్రజా సంబంధాల రంగంలో నిరంతరం పనిచేసేవారికి సమయంతో సంబంధం లేకుండా బాధ్యతలు ఎదురవుతుంటాయి. దయాకర్ రెడ్డి దినచర్య కూడా అందుకు భిన్నంగా ఉండదు. ఉదయం నిద్రలేచిన దగ్గరి నుంచి రాత్రి విశ్రాంతి తీసుకునే వరకు ఫోన్ మోగుతూనే ఉంటుంది. రోజుకు సుమారు రెండు నుంచి మూడు వందల ఫోన్ కాల్స్‌తో ఆయన బిజీగా ఉంటారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రజల విజ్ఞప్తులు వినడం, నాయకులతో మాట్లాడటం, అధికారులతో సమన్వయం చేయడం.. ఇలా ఒక్కో కాల్‌తో మరో బాధ్యత మొదలవుతుంటుంది.ఒకవైపు మంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చే వారి అవసరాలు.. మరోవైపు నియోజకవర్గంలో చేపట్టాల్సిన పనులు.. ఇంకోవైపు జిల్లా స్థాయిలో పార్టీ శ్రేణుల నుంచి వచ్చే సమాచారాన్ని సమన్వయం చేయడం.. ఇలా ఆయన రోజంతా ఉరుకుల పరుగుల మధ్యే సాగుతుంటుంది. ఇక్కడ ముఖ్యమైనది ఫోన్ కాల్స్ సంఖ్య మాత్రమే కాదు.. వాటి వెనుక ఉన్న సమస్యలను అర్థం చేసుకుని, సాధ్యమైన పరిష్కార మార్గాల కోసం ప్రయత్నించాల్సిన బాధ్యత. ఒక సమస్యను సంబంధిత అధికారికి చేరవేయడం దగ్గర నుంచి, దాని పురోగతిని తెలుసుకోవడం వరకు నిరంతర అనుసరణ అవసరమవుతుంది. ఈ క్రమంలో అందుబాటులో ఉండటమే తన పనితీరులో ప్రధాన అంశంగా ఆయన ముందుకు సాగుతున్నారు.


కారు డ్రైవర్ నుంచి పార్టీ కార్యకర్త వరకు సమన్వయం.. 


రాజకీయాల్లో నాయకుడి చుట్టూ అనేక స్థాయుల్లో వ్యక్తులు పనిచేస్తుంటారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, కార్యాలయ సిబ్బంది.. ప్రతి ఒక్కరి పాత్ర భిన్నంగా ఉంటుంది. వీరందరి మధ్య సమన్వయం కుదరడం అంత సులభం కాదు. ఎవరి అవసరాలు వారివి.. ఎవరి సమస్యలు వారివి.. ఎవరి అంచనాలు వారివి. ఇలాంటి భిన్నమైన పరిస్థితుల్లో అందరితో సంబంధాలు కొనసాగిస్తూ ముందుకు సాగడం ఒక ప్రత్యేక నైపుణ్యం.కారు డ్రైవర్ నుంచి కాంగ్రెస్ కార్యకర్త వరకు.. వివిధ స్థాయుల్లో ఉన్న వారితో సంప్రదింపులు కొనసాగిస్తూ, అవసరమైన సమాచారాన్ని ఒకరి నుంచి మరొకరికి చేరవేస్తూ వ్యవహరించడం దయాకర్ రెడ్డి బాధ్యతల్లో భాగంగా మారింది. నాయకత్వానికి ప్రజల గొంతు వినిపించాలన్నా.. ప్రజలకు నాయకత్వం స్పందన చేరాలన్నా.. మధ్యలో సమన్వయ వ్యవస్థ బలంగా ఉండాలి. ఆ వ్యవస్థలో తన పాత్రను సమర్థంగా నిర్వహించాలనే ప్రయత్నమే ఆయన పనితీరులో కనిపించే ప్రధాన అంశం.


ప్రశంసలతో పాటు విమర్శలు..


ప్రజలకు అందుబాటులో ఉండే ప్రతి ఒక్కరికీ ప్రశంసలతో పాటు విమర్శలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా రాజకీయ వాతావరణంలో ప్రతి నిర్ణయానికీ భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతాయి. ఒకరి సమస్య పరిష్కారమైతే మరొకరి పని పెండింగ్‌లో ఉండవచ్చు. ఒక వర్గానికి నచ్చిన నిర్ణయం మరో వర్గానికి నచ్చకపోవచ్చు. అందరి అంచనాలను ఒకేసారి అందుకోవడం సాధ్యం కాని పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. ఇక ప్రత్యర్థి పార్టీ విమర్శలైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలా బాధ్యతల నిర్వహణలో భిన్నమైన అభిప్రాయాలు, విమర్శలను ఎదుర్కొంటున్నప్పటికీ సమన్వయంతో ముందుకు సాగుతున్నారనే అభిప్రాయం ఆయన అనుచరుల్లో వ్యక్తమవుతోంది. కాయలు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్న చందంగా.. ప్రజల్లో నిరంతరం ఉండే వ్యక్తి చుట్టూ చర్చలు, విమర్శలు సహజమే. అయితే వాటన్నింటినీ పక్కనపెట్టి తనకు అప్పగించిన బాధ్యతలపై దృష్టి సారించడం, ప్రజలతో సంబంధాలు కొనసాగించడం, సమస్యల పరిష్కారానికి ప్రయత్నించడం ద్వారా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.


హోదా కంటే అందుబాటే ముఖ్యం.. 


రాజకీయాల్లో ఒక నాయకుడి విజయం వెనుక బహిరంగంగా కనిపించే సభలు, సమావేశాలు, ప్రసంగాలు ఎంత ముఖ్యమో.. తెరవెనుక జరిగే సమన్వయం కూడా అంతే కీలకం. నాయకుడికి ప్రజల నుంచి వచ్చే సమాచారాన్ని చేరవేయడం, పార్టీ శ్రేణులను కలుపుకుపోవడం, అధికార యంత్రాంగంతో సంప్రదింపులు జరపడం వంటి పనులు వెలుగులోకి రాకపోయినా వ్యవస్థ సజావుగా నడవడానికి దోహదపడతాయి. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జిగా  దయాకర్ రెడ్డి నిర్వహిస్తున్న పాత్రకు ప్రాధాన్యం ఏర్పడింది.పదవి ఉండటం ఒక విషయం.. ఆ పదవికి తగ్గట్టుగా నిరంతరం అందుబాటులో ఉండటం మరో విషయం. పేరు సంపాదించడం ఒక విషయం.. ఆ పేరును నిలబెట్టుకోవడానికి ప్రతిరోజూ శ్రమించడం మరో విషయం. ప్రజలతో మమేకమవుతూ, పార్టీ నాయకులు,కార్యకర్తలతో సంబంధాలు కొనసాగిస్తూ, మంత్రి కార్యాలయానికి వచ్చే బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ సాగుతున్న  ప్రయాణం ఈ కోణంలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఒకవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయ ప్రస్థానం.. మరోవైపు ఆయనకు అండగా నిలుస్తూ బాధ్యతలను సమన్వయం చేసే సహచరుల కృషి.. ఈ రెండింటి మధ్య ప్రజలతో సంబంధాలు కొనసాగించడం కీలకమైన అంశం. ఇందులో తనదైన బాధ్యతలో సమన్వయకర్తగా నిలుస్తున్నారు.  ఇప్పుడు పాలేరు పరిధిని దాటి జిల్లా రాజకీయ, ప్రజా వర్గాల్లోనూ చర్చకు వస్తున్నారు. ఫోన్ మోగితే స్పందన.. సమస్య వస్తే సమన్వయం.. బాధ్యత ఎదురైతే ముందడుగు.. ఇదే తన పనితీరుకు గుర్తింపుగా మారుతోంది. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది