ఈ నెల 13న బౌద్ధక్షేత్రానికి విదేశీ బౌద్ధుల రాక.. ప్రధాన కేంద్రం నుంచి క్షేత్రం వరకు శాంతి ర్యాలీ
బౌద్ధక్షేత్రం అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌పై చర్చ.. మంత్రి పొంగులేటి, పురావస్తు శాఖ అధికారుల రాక
ప్రజాపక్షం /నేలకొండపల్లి: ప్రపంచానికి శాంతి సందేశాన్ని చాటుతూ.. బుద్ధుని బోధనలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో చేపట్టిన శాంతి ర్యాలీ నేలకొండపల్లి బౌద్ధక్షేత్రానికి చేరుకోనుంది. ఈ నెల 13న కంబోడియా, థాయ్‌లాండ్‌తో పాటు భారత్‌కు చెందిన బౌద్ధ భిక్షువులు సుమారు 15 మంది ఈ క్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, ప్రవచనాలతో పాటు బౌద్ధ స్థూపం విశిష్టతను తెలియజేసే కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు చారిత్రక బౌద్ధక్షేత్ర అభివృద్ధికి రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌పై చర్చించేందుకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పురావస్తు శాఖ ఉన్నతాధికారులు రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 13న నేలకొండపల్లి ప్రధాన కూడలి నుంచి బౌద్ధక్షేత్రం వరకు శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విదేశాల నుంచి వచ్చే బౌద్ధ భిక్షువులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు శుక్రవారం జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, అదనపు కలెక్టర్ పి.శ్రీజ, జిల్లా పంచాయతీ అధికారి వినోద్‌కుమార్, జిల్లా పర్యాటక అధికారి సుమన్ చక్రవర్తి నేలకొండపల్లి బౌద్ధక్షేత్రాన్ని సందర్శించారు. బౌద్ధ భిక్షువులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించే ప్రాంతం, ప్రవచనాల కోసం ఏర్పాటు చేయనున్న వేదిక తదితర అంశాలను పరిశీలించారు. కార్యక్రమానికి వచ్చే అతిథులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంపై సంబంధిత అధికారులతో చర్చించారు. నేలకొండపల్లి బౌద్ధక్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసి, చారిత్రక ప్రాధాన్యతను ప్రపంచానికి చాటిచెప్పే దిశగా రూపొందించిన నూతన మాస్టర్‌ప్లాన్‌పై త్వరలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పురావస్తు శాఖ డైరెక్టర్, ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు. క్షేత్ర అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులపై ఈ చర్చలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బౌద్ధ గురువు భంతే సద్ధా రక్తితతో అధికారులు ఏర్పాట్లపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి కె.రవిబాబు, తహశీల్దార్ పి.రాంప్రసాద్, మండల పంచాయతీ అధికారి ఎం.శ్రీనివాసరావు, గ్రీన్వే ఎన్విరాన్మెంట్ సొసైటీ అధ్యక్షుడు దుడ్డెల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి