లబ్ధిదారులు ఉంటున్నారా?.. విక్రయించారా?.. అర్హులెవరు?
అసంపూర్తి ఇళ్లపై సమగ్ర నివేదికకు కలెక్టర్ ఆదేశాలు
ప్రజాపక్షం / నేలకొండపల్లి: ప్రభుత్వం పేదలకు అందించిన డబుల్ బెడ్రూం ఇళ్లలో అసలైన లబ్ధిదారులే నివాసం ఉంటున్నారా?.. ఇతరులకు విక్రయించారా?.. కొనుగోలు చేసిన వారు అర్హులేనా?.. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి ఎంత ఖర్చవుతుంది?.. అనే అంశాలపై జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి విచారణకు ఆదేశించారు. ఈ మేరకు మండలంలోని వివిధ గ్రామాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేపట్టి వివరాలు సేకరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం నేలకొండపల్లి మండలంలోని శంకరగిరితండా, కట్టుకొమ్మతండా గ్రామాల్లో జాయింట్ వెరిఫికేషన్ బృందం పర్యటించింది. తహశీల్దార్ పి. రాంప్రసాద్, ఎంపీడీవో ఎం. యర్రయ్య, గృహ నిర్మాణ శాఖ ఏఈ యాకయ్య లబ్ధిదారుల ఇళ్లను సందర్శించి క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించారు. గత ప్రభుత్వం హయాంలో మంజూరైన డబుల్ బెడ్రూం ఇళ్లలో లబ్ధిదారులు నివాసం ఉంటున్నారా?.. ఇతరులకు అద్దెకు ఇచ్చారా?.. విక్రయించారా?.. విక్రయించినట్లయితే కొనుగోలు చేసిన వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులేనా? అనే అంశాలను పరిశీలించారు. ఇళ్లు పొందినప్పటి నుంచి ఇప్పటివరకు నివాసం ఉండని వారు ఎవరైనా ఉంటే, అందుకు గల కారణాలను కూడా నమోదు చేస్తున్నారు. మండలంలోని నేలకొండపల్లి పంచాయతీ పరిధిలోని సింగారెడ్డిపాలెంలో ఉన్న జీ ప్లస్ 2 డబుల్ బెడ్రూం ఇళ్లతో పాటు శంకరగిరితండాలోని 30 ఇళ్లు, గువ్వలగూడెంలోని 30 ఇళ్ల పరిస్థితిని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణ పనులు ఏ దశలో నిలిచిపోయాయి?.. విద్యుత్ సౌకర్యం ఉందా?.. డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులో ఉందా?.. మిగిలిన పనులు పూర్తి చేయడానికి ఎంత మేర నిధులు అవసరమవుతాయి? అనే అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేసేందుకు అవసరమైన వ్యయ అంచనాలతో పాటు ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ సమగ్ర నివేదికను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ పథకం ద్వారా నిర్మించిన ఇళ్ల వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడం, అర్హులైన పేదలకు ఇళ్ల ప్రయోజనం అందేలా చూడడం, అసంపూర్తి నిర్మాణాలపై స్పష్టత తీసుకురావడమే ఈ క్షేత్రస్థాయి పరిశీలన ప్రధాన ఉద్దేశంగా అధికారుల విచారణ కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి