ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

అసంపూర్తి పనులకు బిల్లు పెట్టాలంటూ ఒత్తిడి.. అధికారులను బద్నాం చేసేందుకు కాంట్రాక్టర్ కుట్ర


 


విలేకరుల సమావేశంలో ఖమ్మం రూరల్ విద్యుత్ శాఖ డీఈ చింతమల నాగేశ్వరరావు 


ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: అసంపూర్తిగా ఉన్న విద్యుత్ పనులకు బిల్లులు చెల్లించాలని ఒత్తిడి చేస్తూ, నిబంధనల ప్రకారం వ్యవహరించిన అధికారులపై కాంట్రాక్టర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఖమ్మం రూరల్ విద్యుత్ శాఖ డీఈ చింతమల నాగేశ్వరరావు పేర్కొన్నారు. పనులు పూర్తికాకుండానే బిల్లులు పెట్టాలన్న డిమాండ్‌కు అధికారులు అంగీకరించకపోవడంతో వారిని ఇబ్బందులకు గురిచేసేలా కాంట్రాక్టర్ వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.శుక్రవారం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డులో ఉన్న ఖమ్మం రూరల్ సబ్ డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఈ మాట్లాడారు...మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజలకు విద్యుత్ సరఫరా పరంగా ఇబ్బందులు లేకుండా పెద్ద లైన్ మార్పు పనుల కోసం రూ.37 లక్షలతో అంచనాలు రూపొందించినట్లు తెలిపారు.ఈ పనుల్లో భాగంగా చిన్న వెంకటగిరిలో ఆరు టవర్లు, చిన్నతండాలో నాలుగు టవర్లు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. వెంకటగిరిలో చేసిన పనులకు బిల్లులు కాంట్రాక్టర్కు ఎల్ఓసి అందించామన్నారు. కానీ చిన్నతండాలో రెండు టవర్లు మాత్రమే ఏర్పాటు చేసి, మిగిలిన పనులు అసంపూర్తిగా వదిలేశారని వివరించారు. ముఖ్యంగా టవర్లు ఏర్పాటు చేసినప్పటికీ విద్యుత్ వైర్లు లాగకపోవడంతో పనులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదన్నారు. ఈ పరిస్థితుల్లో మొత్తం పనులు పూర్తయిన తర్వాతే బిల్లులు సమర్పించాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు స్పష్టం చేసినట్లు వెల్లడించారు.అయితే, పనులు పూర్తిచేయాలన్న అధికారుల సూచనలను పక్కనపెట్టి, బిల్లుల విషయంలో అధికారులు సహకరించడం లేదనే విధంగా కాంట్రాక్టర్ వ్యవహరిస్తూ కార్యాలయం వద్దకు వచ్చి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని డీఈ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ చేసిన పనులకు సంబంధించి ఎల్‌ఓసీ కొట్టినప్పటికీ, మిగిలిన పనులు పూర్తి చేయకుండా అధికారులపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.ప్రభుత్వ నిధులతో చేపట్టిన ప్రజల పనులు నాణ్యతతో, పూర్తిస్థాయిలో జరగాలన్నదే తమ ఉద్దేశం అన్నారు. ఈ వ్యవహారాలపై ఉన్నతాధికారులతో చర్చించి, తప్పుడు ఆరోపణలు చేస్తూ కార్యాలయ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్న కాంట్రాక్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ఏడి  కోక్య నాయక్  పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది