ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఖమ్మంలో ఘోర ప్రమాదం.. తల్లిదండ్రుల కళ్ల ముందే కన్నుమూసిన చిన్నారి!


 

మూడేళ్ల నిషిత మృతి.. రెప్పపాటులో ఆ కుటుంబంలో తీరని విషాదం


ప్రజాపక్షం/ఖమ్మం: అమ్మ ఒడిలో కూర్చుని ముద్దుముద్దుగా మాట్లాడాల్సిన వయసు.. నాన్న చేయి పట్టుకుని అడుగులు వేయాల్సిన పసిప్రాయం.. కానీ విధి ఆ చిన్నారిపై పగబట్టిందో ఏమో.. రెప్పపాటులో ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. తల్లిదండ్రులతో కలిసి సరదాగా స్కూటీపై వెళ్తున్న మూడేళ్ల చిన్నారి నిషిత.. రోడ్డు ప్రమాదంలో విగతజీవిగా మారింది. కళ్ల ముందే కన్నబిడ్డను కోల్పోయిన తల్లిదండ్రుల ఆర్తనాదాలు చూపరులను కంటతడి పెట్టించాయి.


సిగ్నల్‌ దాటుతుండగా మృత్యువు రూపంలో లారీ..


ఖమ్మం నగరంలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద అశోక్‌–సంధ్య దంపతులు తమ మూడేళ్ల కుమార్తె నిషితతో కలిసి స్కూటీపై వెళ్తున్నారు. ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఆగారు .. అనంతరం ముందుకు కదులుతుండగా వెనుక నుంచి వచ్చిన లారీ వారి స్కూటీని బలంగా ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో తల్లి ఒడిలో ఉన్న చిన్నారి కిందపడగా, లారీ టైరు మీదుగా వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. క్షణాల ముందు వరకు తమ మధ్య నవ్వుతూ ఉన్న చిన్నారి.. కళ్ల ముందే విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల గుండె పగిలేలా రోదించారు.


ఆ తల్లిదండ్రులకు తీరని శోకం..


చిన్నారి నవ్వులతో కళకళలాడాల్సిన ఆ ఇల్లు.. ఇప్పుడు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. అమ్మా, నాన్న అంటూ పిలుస్తూ ఇంటిల్లిపాదిని మురిపించాల్సిన పసిపాప ఇక లేదన్న నిజాన్ని ఆ తల్లిదండ్రులు ఎలా తట్టుకుంటారో అన్న ఆవేదన అక్కడివారిని కలచివేసింది. ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఖమ్మం నగరంలో విషాదఛాయలు అలముకున్నాయి. అభం శుభం తెలియని పసిప్రాణం రోడ్డు ప్రమాదానికి బలికావడం ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. రోడ్డుపై ఒక్క క్షణం నిర్లక్ష్యం.. ఒక కుటుంబానికి జీవితాంతం తీరని శోకాన్ని మిగిల్చగలదనే చేదు నిజాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم