సిబ్బందిని పంపించి చేతులు దులుపుకుంటున్న వైనం
ఆర్అండ్బీ అధికారుల తీరుపై ఫిర్యాదుల పరంపర
ప్రజాపక్షం / నేలకొండపల్లి: ప్రజల సమస్యలు నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి, అక్కడికక్కడే పరిష్కారానికి మార్గం చూపించాల్సిన ప్రజావాణి కార్యక్రమానికే మండల స్థాయి అధికారులు డుమ్మా కొడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు స్వయంగా హాజరు కాకుండా కింది స్థాయి సిబ్బందిని పంపించి మమ అనిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో తహశీల్దార్ రాంప్రసాద్, ఎంపీడీఓ ఎం. యర్రయ్య ఆధ్వర్యంలో మండల స్థాయి ప్రజావాణి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల వ్యవసాయాధికారి మినహా పలువురు శాఖల అధికారులు హాజరు కాలేదు. తమకు బదులుగా సిబ్బందిని పంపించగా, మరికొన్ని శాఖల అధికారులు కనీసం సిబ్బందిని కూడా పంపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. మరికొందరు అధికారులు సమయపాలన పాటించకుండా కార్యక్రమం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. మండల ప్రజావాణిలో ఆర్అండ్బీ అధికారుల పనితీరుపై కొత్తకొత్తూరు గ్రామానికి చెందిన పాగర్తి సుధాకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి ప్రజావాణిలో రహదారి సమస్యలపై ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కనీసం సమస్యపై సమాచారం తెలుసుకునేందుకు ఆర్అండ్బీ జేఈ స్థాయి అధికారి కూడా ప్రజావాణికి హాజరు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేలకొండపల్లి, కొత్తకొత్తూరు, తిరుమలాపురం పంచాయతీల పరిధిలో రహదారి డివైడర్ల మధ్య ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు వెలగడం లేదని, ఈ విషయంపై పలుమార్లు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. లైట్ల నిర్వహణ బాధ్యతలను సంబంధిత పంచాయతీలకు అప్పగిస్తే పంచాయతీలే నిర్వహణ చేపట్టే అవకాశం ఉంటుందని, ఈ దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని పాగర్తి సుధాకర్ హెచ్చరించారు. ప్రజావాణికి అధికారులు హాజరు కాకపోవడం, ప్రజలు ఇచ్చే ఫిర్యాదులపై తగిన స్పందన లేకపోవడంపై ఎంపీడీఓ ఎం. యర్రయ్య స్పందిస్తూ ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి సంబంధిత శాఖల అధికారులతో సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలపై పలువురు ప్రజలు దరఖాస్తులు సమర్పించారు. అధికారులు స్వయంగా హాజరై ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి