సమాజ వికాసమే సాహిత్యం.. ప్రజాస్వామ్య పరిరక్షణకు సామాజిక చైతన్యం అవసరం: ప్రజాకవి లెనిన్ శ్రీనివాస్
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: సమాజ వికాసానికి సాహిత్యం దోహదపడాలని, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంలో సాహితీవేత్తలు కీలక పాత్ర పోషించాలని ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడానికి చెందిన తెలంగాణ రాష్ట్ర వికాస వేదిక సాహిత్య సంస్థ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, ప్రజాకవి లెనిన్ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం డా. పట్టాభి కళాపీఠం ఆధ్వర్యంలో, డా. తూములూరి రాజేంద్ర ప్రసాద్ సంపాదకత్వంలో గుంటూరు ఎస్హెచ్ఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో “భారతదేశంలో రాజకీయ పార్టీల ఫిరాయింపులు” కవితా సంకలనాన్ని ఆయన విశిష్ట అతిథిగా హాజరై ఆవిష్కరించారు. సభకు డా. తూములూరి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా పిల్లల వైద్యురాలు డా. టి. సుస్మిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా లెనిన్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సమాజం సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోందని, ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాల్సిన రాజకీయ పార్టీలు పరస్పర విమర్శలు, మాటల యుద్ధాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయని అన్నారు. ప్రశ్నించే హక్కును గౌరవించడంతోపాటు ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాల్లో నైతిక విలువలు క్షీణించడం, పార్టీ ఫిరాయింపులు పెరగడం ఆందోళనకరమని పేర్కొన్నారు. డబ్బు ప్రభావంతో రాజకీయాలు నడవడం, కుటుంబ వారసత్వ రాజకీయాలకు ప్రాధాన్యం పెరగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. సమాజం నుంచి కుల, మత విభేదాలు తొలగిపోయినప్పుడే ప్రజాస్వామ్య విలువలు మరింత బలోపేతమవుతాయని అభిప్రాయపడ్డారు. డా. టి. సుస్మిత మాట్లాడుతూ.. పిల్లలకు సాధ్యమైనంతవరకు సెల్ఫోన్ల వినియోగాన్ని పరిమితం చేయాలని సూచించారు. అధికంగా ఫోన్ వినియోగించడం పిల్లల ఎదుగుదల, ప్రవర్తనపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. పిల్లలకు చందమామ కథలు, స్ఫూర్తిదాయకమైన చారిత్రక సంఘటనలు, మంచి విలువలను నేర్పే కథలను చెప్పడం ద్వారా వారిలో సృజనాత్మకత, నైతిక విలువలను పెంపొందించవచ్చని వివరించారు. సభాధ్యక్షుడు డా. తూములూరి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. డా. పట్టాభి కళాపీఠం ఆధ్వర్యంలో సమాజానికి ఉపయోగపడే అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. గుర్తింపునకు నోచుకోని ప్రతిభావంతులను గుర్తించి గౌరవించడంతోపాటు, సమాజ హితాన్ని కాంక్షించే పుస్తకాలను ప్రచురిస్తూ సాహితీ లోకానికి అందిస్తున్నామని వివరించారు. సాహిత్యం ద్వారా సామాజిక సమస్యలపై చర్చకు అవకాశం కల్పిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఇటువంటి కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు.

إرسال تعليق