మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు
కుటుంబ సభ్యులను పరామర్శించిన క్యాంప్ కార్యాలయ ఇన్చార్జ్ దయాకర్‌రెడ్డి
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 31 వ వార్డులోని సింహాద్రినగర్కు చెందిన దార సుప్రియ అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సుప్రియ మృతిపై ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన చర్యలను వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం మంత్రి పొంగులేటి సూచనల మేరకు ఖమ్మం క్యాంప్ కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి సింహాద్రినగర్‌లోని సుప్రియ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారి బాధను పంచుకుని, ధైర్యం చెప్పారు. అనంతరం ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డికి ఫోన్ చేయగా, ఆయన సైతం మృతురాలి కుటుంబ సభ్యులతో స్వయంగా మాట్లాడి ఓదార్చారు. సుప్రియ మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు అమెరికాలోని భారత రాయబార కార్యాలయ ఉన్నతాధికారులతో పలుమార్లు సంప్రదింపులు జరుపుతున్నట్లు ఎంపీ రఘురాం రెడ్డి కుటుంబ సభ్యులకు తెలిపారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు ప్రభుత్వం, మంత్రి పొంగులేటి అండగా ఉంటారని దయాకర్‌రెడ్డి తెలిపారు. సుప్రియ మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్న నేపథ్యంలో వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పోకబత్తిని అనిత, వైస్‌చైర్మన్ తమ్మినేని నవీన్, మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు బానోత్ కిషోర్, గరికపాటి ఆంజనేయ ప్రసాద్, పలువురు కౌన్సిలర్లు, స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق