ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఆర్టీవో కార్యాలయంలో పేర్ల నమోదు ప్రక్రియ పై చర్చ!



 




ప్రజాపక్షం కథనంతో తెరపైకి వచ్చిన హెల్ప్ డెస్క్ ఆవశ్యకత

ప్రజాపక్షం/ఖమ్మం( బైపాస్ రోడ్డు) : ఖమ్మం జిల్లా ఆర్టీఓ కార్యాలయం గేటు వద్దకు వచ్చే ప్రతి ఒక్కరి పేర్లు, వివరాలను హోంగార్డు ద్వారా నమోదు చేయిస్తున్న వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాన్ని ప్రజాపక్షం దినపత్రిక నేటి సంచికలో ప్రధానంగా క్రోడీకరించి ప్రచురించడంతో కార్యాలయంలో అమలవుతున్న ఈ విధానం, ప్రజలకు అందాల్సిన సేవల తీరుపై చర్చ తెరపైకి వచ్చింది. కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరి వివరాలు నమోదు చేయడంపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయానికి వచ్చే ప్రజల వివరాలను ఎందుకు సేకరిస్తున్నారు? ఈ ప్రక్రియ వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? ఇది ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అమలవుతున్న విధానమా? లేక స్థానికంగా తీసుకున్న నిర్ణయమా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

పేర్ల నమోదుకే ప్రాధాన్యమా.. ప్రజాసేవకు లేదా?

ఆర్టీఓ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు సరైన సమాచారం అందించడం, అవసరమైన పత్రాలపై అవగాహన కల్పించడం, సంబంధిత విభాగాలకు మార్గనిర్దేశం చేయడం ఎంతో ముఖ్యం. ఈ నేపథ్యంలో గేటు వద్ద పేర్ల నమోదు ప్రక్రియను నిర్వహించడంతోపాటు, అక్కడే హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన సేవలపై సమాచారం అందిస్తే మరింత ప్రయోజనం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏ పని కోసం ఎవరిని సంప్రదించాలి? ఏయే పత్రాలు తీసుకురావాలి? దరఖాస్తు ప్రక్రియ ఏమిటి? వంటి సందేహాలకు హెల్ప్ డెస్క్ ద్వారా సమాధానాలు అందిస్తే ప్రజలు కార్యాలయం చుట్టూ తిరిగే ఇబ్బందులు తగ్గుతాయి. సిబ్బంది సమయమూ ఆదా అవుతుంది. పారదర్శకమైన సేవలకు అవకాశం ఏర్పడుతుంది. కానీ ఇలా ఇష్టానుసారంగా ప్రభుత్వ కార్యాలయానికి వచ్చే తమ వివరాలు తీసుకోవడం ఏమిటని మండిపడుతున్నారు.

విధానం వెనుక ఉద్దేశం ఏమిటి?

కార్యాలయ భద్రత లేదా ఇతర పరిపాలనా అవసరాల దృష్ట్యా వివరాలు సేకరిస్తున్నట్లయితే, అందుకు సంబంధించిన ఉద్దేశాన్ని అధికారులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధానం ఏ నిబంధనల ప్రకారం అమలవుతోంది? ప్రజల నుంచి సేకరిస్తున్న వివరాలను ఏ అవసరానికి వినియోగిస్తున్నారు? అన్న అంశాలపై స్పష్టత వస్తే అనవసర సందేహాలకు తావుండదు.

కొసరు ప్రక్రియ కంటే అసలు సేవలకే ప్రాధాన్యం ఇవ్వాలి!

ప్రభుత్వ కార్యాలయాల పనితీరును ప్రజలకు అందించే సేవల ఆధారంగా అంచనా వేయాలి. కార్యాలయానికి వచ్చే వారి వివరాల నమోదు ప్రక్రియతోపాటు, వారి పనులు సులభంగా పూర్తయ్యేలా చూడటం కూడా అంతే ముఖ్యం. పేర్ల నమోదు వ్యవస్థ కొనసాగించినా, దానికి అనుబంధంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ప్రజలకు మార్గనిర్దేశం చేయడం ద్వారా మెరుగైన సేవలు అందించవచ్చు. ప్రజాపక్షం కథనంతో తెరపైకి వచ్చిన ఈ అంశంపై సంబంధిత అధికారులు స్పందించి, పేర్ల నమోదు విధానం వెనుక ఉన్న ఉద్దేశాన్ని వెల్లడించడంతోపాటు, ప్రజలకు ఉపయోగపడే హెల్ప్ డెస్క్ ఏర్పాటుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.





కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది