ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

అభివృద్ధి పనులకు వేగం పెంచాలి



 


నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి.. అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి


ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: పాలేరు నియోజకవర్గంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. పనుల నాణ్యతలో రాజీ పడకుండా, ప్రజలకు సకాలంలో అభివృద్ధి ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.సోమవారం ఖమ్మంలోని శ్రీశ్రీ సర్కిల్‌ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్‌ పి. శ్రీనివాసరెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంజనీరింగ్‌, ఇరిగేషన్‌, వ్యవసాయం, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్‌ తదితర శాఖల పరిధిలో జరుగుతున్న పనుల పురోగతి, నిధుల మంజూరు, ఎదురవుతున్న సమస్యలపై సమీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భూసేకరణ, ఇతర సాంకేతిక సమస్యలను సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో వెంటనే పరిష్కరించుకోవాలని సూచించారు. అభివృద్ధి పనులకు అడ్డంకిగా ఉన్న విద్యుత్‌ స్తంభాలను త్వరితగతిన తొలగించి, అవసరమైన చోటకు మార్చాలని విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, నిర్ణీత గడువులోగా పూర్తి చేసే బాధ్యతను అధికారులు తీసుకోవాలన్నారు.అభివృద్ధి పనుల వల్ల భూములు, ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు. భూమికి బదులుగా భూమి, ఇంటికి బదులుగా ఇల్లు కల్పించే దిశగా ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి నెలా రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.


నీరు, విద్యుత్‌ పొదుపుగా వినియోగించాలి


దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. రానున్న రోజుల్లో ప్రజలకు తాగునీరు, విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.నీటి లభ్యత తక్కువగా ఉన్నందున రెండో పంట సాగుపై రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. నీటి వనరుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రైతులకు స్పష్టమైన సమాచారం అందించాలన్నారు.ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయం ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి,  ఇరిగేషన్‌ సీఈ వాసంతి, ఎస్‌ఈ ఎం. వెంకటేశ్వర్లు, ఆర్‌ అండ్‌ బీ ఎస్‌ఈ యుగంధర్‌రావు, పీఆర్‌ ఎస్‌ఈ వెంకట్‌రెడ్డి, విద్యుత్‌ ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ శేఖర్‌రెడ్డి, మెడికల్‌ ఈఈ ఉమామహేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి డి. పుల్లయ్యతో పాటు వివిధ ఇంజనీరింగ్‌ శాఖల ఈఈలు, డీఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది