క్షేత్రస్థాయిలో పర్యటించి ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే బి. చంద్రావతి
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి గ్రాడ్యుయేట్ తన ఓటు హక్కును వినియోగించుకునేలా అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని వైరా మాజీ ఎమ్మెల్యే బి. చంద్రావతి పిలుపునిచ్చారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమని, అర్హత కలిగిన ఏ ఒక్క పట్టభద్రుడూ ఓటరు నమోదుకు దూరంగా ఉండకూడదని ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేసి, క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మంగళవారం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 26వ డివిజన్‌లో బీఆర్ఎస్ నేత బానోతు కృష్ణ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని చంద్రావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ఆమె స్వయంగా ఇంటింటికీ వెళ్లి అర్హులైన గ్రాడ్యుయేట్ల వివరాలను సేకరించడంతో పాటు ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులతో మాట్లాడి రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు. అనంతరం బానోతు కృష్ణ క్యాంపు కార్యాలయంలో ఇప్పటివరకు జరిగిన ఓటరు నమోదు ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఈ నెల 25వ తేదీలోపు అర్హులైన పట్టభద్రులందరి నమోదు పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా ప్రతి డివిజన్‌లో ఇంటింటికీ వెళ్లి అర్హులైన ఓటర్లను గుర్తించాలని సూచించారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగ పట్టభద్రులను ప్రత్యక్షంగా కలిసి ఓటరు నమోదుకు అవసరమైన వివరాలు సేకరించాలని ఆమె పేర్కొన్నారు. ఆఫ్‌లైన్‌లో నమోదు చేసుకునే వారికి సహకరించడంతో పాటు, ఆన్‌లైన్‌లోనూ ఓటరు నమోదు పూర్తయ్యేలా పార్టీ శ్రేణులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న అర్హులైన పట్టభద్రులను సైతం సంప్రదించి, వారికి సమాచారం అందించి, నమోదు ప్రక్రియలో భాగస్వాములను చేయాలని అన్నారు.
ఓటరు నమోదుకు ప్రత్యేక సేవా కేంద్రం
పట్టభద్రుల ఓటరు నమోదు కోసం ప్రత్యేక సేవా కేంద్రాన్ని ప్రారంభించినట్లు చంద్రావతి తెలిపారు. అర్హులైన గ్రాడ్యుయేట్లు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకొని తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని కోరారు. నమోదు ప్రక్రియపై సందేహాలు ఉన్నవారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని పార్టీ నాయకులకు సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు నిరంతరం ప్రజల్లో ఉంటూ, పార్టీ ఆదేశాలకు అనుగుణంగా కార్యాచరణను అమలు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా నాయకురాలు బానోతు జ్యోతి, మాజీ వైస్ ఎంపీపీ బానోతు సుజాత, సంధ్య, మున్సిపాలిటీ బి ఆర్ ఎస్ నాయకులు బానోతు కృష్ణ, అన్వేష్, అఖిల్, నిఖిల్ , జగన్ , రవి తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి