ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

తరుణి హట్ లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు.. పూల పండుగకు విశేష స్పందన.!



 ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీమణి మాధురి.. మహిళలతో కలిసి బతుకమ్మ ఆటలు

మున్సిపల్ అధికారులు, సిబ్బంది, మహిళల నృత్యాలతో మార్మోగిన ప్రాంగణం

14 ఏళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే సంబరాలు: తుంబురు దయాకర్ రెడ్డి

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డు తరుణి హాట్‌లో సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రకృతిలో లభించే రంగురంగుల పూలను అందంగా పేర్చి బతుకమ్మలను సిద్ధం చేసిన మహిళలు, వాటి చుట్టూ చేరి ఆటపాటలతో సందడి చేశారు. పూల పరిమళాలు, మహిళల కోలాటాలు, ఉత్సాహభరితమైన నృత్యాలతో తరుణి హాట్‌ పండుగ శోభను సంతరించుకుంది. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో నిర్వహించిన ముద్దపప్పు బతుకమ్మ వేడుకలకు స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీమణి మాధురి హాజరుకావడంతో కార్యక్రమానికి మరింత ప్రత్యేకత చేకూరింది.

ముఖ్య అతిథిగా మాధురి.. మహిళలతో మమేకమై సందడి

బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాధురి మహిళల మధ్యకు చేరి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. బతుకమ్మను ఎత్తుకొని స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆటలు ఆడుతూ సందడి చేశారు. పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ మహిళలు వలయంగా చేరి సంప్రదాయ పాటలు పాడుతూ పండుగ వైభవాన్ని చాటిచెప్పారు. పండుగలో మహిళలతో కలిసి మాధురి పాల్గొనడం అక్కడికి వచ్చిన వారిలో ఉత్సాహాన్ని నింపింది. తెలంగాణ ఆడపడుచులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలుస్తుందని ఈ వేడుకలు మరోసారి చాటిచెప్పాయి. అలాగే ఈ తుంబురు దయాకర్ రెడ్డి సతీమణి,  మున్సిపాలిటీ చైర్మన్ పోకబత్తిని అనిత మహిళలతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆటలు ఆడారు. స్థానిక సీపీఐ కౌన్సిలర్ దండి శ్రీజ సైతం దుర్గామాత మాల ధరించి బతుకమ్మను ఎత్తుకొని వేడుకల్లో పాల్గొన్నారు. వివిధ రంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన పూజలు, ఆటపాటలతో మహిళలు ఉత్సాహంగా గడిపారు. రోజువారీ పనులు, కుటుంబ బాధ్యతలతో నిమగ్నమయ్యే మహిళలంతా ఒకచోట చేరి సంతోషంగా పండుగను జరుపుకోవడం వేడుకలకు ప్రత్యేక కళను తీసుకొచ్చింది.

14 ఏళ్ల తర్వాత మళ్లీ తరుణి హాట్‌లో పండుగ వాతావరణం

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబురు దయాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సుమారు 14 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇదే ప్రాంతంలో స్తంభాద్రి సంబరాల పేరిట ఉత్సవాలు నిర్వహించినట్లు గుర్తుచేశారు. అప్పట్లో ఈ ఉత్సవాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించేదని, పరిసర గ్రామాలు, తండాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంబరాలను వీక్షించేవారని తెలిపారు. కాలక్రమంలో తరుణి హాట్‌కు ప్రాధాన్యత తగ్గిందని పేర్కొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణం చేపట్టడంతో తరుణి హాట్‌కు మళ్లీ గుర్తింపు లభించిందని దయాకర్ రెడ్డి వివరించారు. ప్రస్తుతం బతుకమ్మ పండుగ పేరుతో మహిళలందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి, పూలతో కళకళలాడే ఈ ప్రాంతంలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పడం ఆనందంగా ఉందన్నారు. పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల మధ్య మహిళలు ఆనందోత్సాహాలతో గడపడం ఈ ప్రాంతానికి మరింత శోభను తీసుకొచ్చిందని పేర్కొన్నారు. 14 సంవత్సరాల తర్వాత మళ్లీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో సంబరాలు నిర్వహించడం విశేషమని తెలిపారు.


నృత్యాలతో హోరెత్తిన వేడుకలు


మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది, ఔత్సాహికులు, స్థానిక మహిళలు డీజే పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ వేడుకలను మరింత ఉత్సాహభరితంగా మార్చారు. చిన్నా పెద్దా, ఆడా మగా అనే తేడా లేకుండా పలువురు కాలు కదుపుతూ సంబరాల్లో భాగస్వాములయ్యారు. సంగీత హోరు, కేరింతలు, చప్పట్లతో తరుణి హాట్ ప్రాంగణం మార్మోగింది. మహిళల సంప్రదాయ ఆటలు ఒకవైపు, యువత ఉత్సాహభరితమైన నృత్యాలు మరోవైపు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, సిపిఐ కౌన్సిలర్లు దండి రంగారావు, మామిండ్ల శ్రీనాథ్ రెడ్డి, కాంగ్రెస్ కౌన్సిలర్లు సోము వెంకటరెడ్డి, పూల్చంద్, బానోతు దివ్య వెంపటి ఉమా, కందుకూరి శేషమ్మ, మున్సిపాలిటీ అధికారులు శ్రీధర్ రెడ్డి, అప్పారావు , కిరణ్, రఘు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది