30 ఏళ్ల నృత్య ప్రస్థానానికి గుర్తింపు
నటుడు సుమన్ చేతుల మీదుగా జ్ఞప్తిక అందజేత
ప్రజాపక్షం / ఖమ్మంరూరల్ : నృత్యాన్ని తన శ్వాసగా, తన జీవితంగా మలచుకుని 30 సంవత్సరాలుగా నిర్విరామంగా నృత్య రంగంలో సేవలందిస్తున్న నృత్య దర్శకులు, ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాల సాంస్కృతిక అధ్యాపకుడు ఆర్ఎం ప్రసాద్ కి ప్రతిష్టాత్మక ఇండియన్ గ్లోరీ అవార్డు లభించింది. కళారత్న మూవీస్, రాజు ఎంటర్టైనర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాదులో నిర్వహించిన కార్యక్రమంలో సినీ నటుడు సుమన్ ఆర్ఎం ప్రసాద్ కు ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా నటుడు సుమంత్ తో పాటు పలువురు ప్రముఖులు మాట్లాడుతూ... మూడు దశాబ్దాల పాటు ఎంతో మంది ఔత్సాహిక కళాకారులను తీర్చిదిద్దుతూ వేలాది మంది విద్యార్థులకు నృత్యంలో మెళకువలు నేర్పించారన్నారు. కళా రంగానికి ఆయన చేసిన కృషి నీ కొనియాడారు. డాన్స్ అంటే కేవలం స్టెప్పులు మాత్రమే కాదని అది ఒక క్రమశిక్షణ, ఒక సంస్కారం అని తన శిష్యులకు నిరూపించారన్నారు. ఎన్నో వేదికలపై తనదైన ముద్ర వేసి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నప్పటికీ ఈగ్లోరీ అవార్డు ఆయన 30 ఏళ్ల సుదీర్ఘ కళా ప్రయాణానికి దక్కిన గొప్ప గుర్తింపు అని అభినందించారు. కష్టపడి పనిచేస్తే కళ ఎప్పటికైనా గుర్తిస్తుందని ఆయన నిరూపించారన్నారు. రాబోయే రోజుల్లో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మరెంతో మంది కళాకారులను తయారు చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆర్ ఎం ప్రసాద్ ను వారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటులు సుమన్, సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, విఎన్ ఆదిత్య, సినీ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, హాస్యనటులు జెన్నీ, వందే భారత్ దర్శకులు, ప్రముఖ మిమిక్రీ కళాకారులు మల్లం రమేష్, నటుడు, దర్శకులు, మెజీషియన్ రామడుగు వసంత కుమార్, కమెడియన్ యాంకర్ మొగిలి తదితరులు పాల్గొన్నారు.
ప్రియదర్శిని విద్యాసంస్థల అధినేత నవీన్ బాబు అభినందనలు..
30 సంవత్సరాలుగా విద్యార్థులకు నృత్యాలు నేర్పిస్తూ ఎన్నో అవార్డులు రివార్డులు సాధించిన తమ కళాశాల కల్చరల్, డాన్స్ మాస్టర్ ఆర్ఎం ప్రసాద్ కు ఇండియన్ గ్లోరీ అవార్డు- 2026 రావడం అభినందనీయమని ప్రియదర్శిని విద్యా సంస్థల అధినేత డాక్టర్ కె నవీన్ బాబు అన్నారు. సోమవారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో అవార్డు గ్రహీత ఆర్ ఎం ప్రసాద్ ను నవీన్ బాబు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి గోపాల్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు. ఈ సందర్భంగా నవీన్ బాబు మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా విద్యార్థులకు డాన్స్ నేర్పిస్తూ ఎన్నో అవార్డు తెచ్చి ఖమ్మం ఖ్యాతిని తెలంగాణలో నెంబర్ వన్ గా చేసినందుకుగాను ఆర్. యన్.ప్రసాద్ కి ఈ అవార్డు దక్కినందన్నారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించడంతో పాటు జాతీయస్థాయిలో గుర్తింపు సాధించాలని ఆయన ఆకాంక్షించారు

إرسال تعليق