ఎస్సార్ఎల్పీ పాలేరు లింక్ కెనాల్ భూసేకరణను నిలిపివేయాలి
తహసీల్దార్‌కు నాలుగు గ్రామాల రైతుల వినతి
ప్రజాపక్షం/రఘునాథపాలెం: సీతారామ ఎత్తి పోతల పథకం (ఎస్సార్ఎల్పీ)లో భాగంగా ప్రతిపాదించిన పాలేరు లింక్ కెనాల్ భూసేకరణపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాలను బలితీసుకునే కాలువ నిర్మాణం తమకు వద్దే వద్దంటూ రఘునాథపాలెం మండల పరిధిలోని నాలుగు గ్రామాల రైతులు ఏకతాటిపైకి వచ్చి ఆందోళన బాట పట్టారు. మంగళవారం మండలంలోని చిమ్మపూడి, మంచుకొండ, కోయచలక, రేగులచలక గ్రామాల రైతులు రఘునాథపాలెం తహసీల్దార్ ఎస్. శ్వేత ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, కాలువ తవ్వకం వల్ల వచ్చే ప్రయోజనాల కంటే తాము సర్వస్వం కోల్పోయి నడిరోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు . తరతరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సారవంతమైన భూములను కెనాల్ కోసం లాక్కుంటే తాము బతికేదెలాగని ప్రశ్నించారు. వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్న తమ కుటుంబాల భవిష్యత్తు అంధకారం అవుతుందన్నారు. అధికారులు కాలువ ప్రతిపాదనను రద్దు చేసి భూసేకరణ ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.nతమ గోడును ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని రైతులు స్పష్టం చేశారు.


إرسال تعليق