- అప్పటి వాగు అడ్డుగోడైతే నేడు అభివృద్ధికి మార్గం
- మారిన తేజావత్ కుటుంబాల స్థిర నివాసం
- రూ.6.75 కోట్లతో మంత్రి పొంగులేటి శంకుస్థాపన
- ఎడబాటును గుర్తు చేసుకుంటున్న ప్రజలు
ప్రజాపక్షం / ఖమ్మం రూరల్ :ఖమ్మం రూరల్ మండలం ఊటవాగు తండా–తీర్థాల మధ్య ఆకేరుపై నిర్మాణం కోసం తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేసిన చెక్‌డ్యాం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం అభివృద్ధి పనిగా మాత్రమే కాకుండా దశాబ్దాల చరిత్రను గుర్తు చేసే అంశంగా నిలుస్తోంది.గతంలో తేజావత్ కుటుంబ సభ్యులు ఈ ప్రాంతానికి వలస వచ్చి స్థిరపడిన సమయంలో ఆకేరు ప్రవాహం వారి జీవన విధానాన్ని ప్రభావితం చేసేది. నీరు లేని కాలంలో ఊటవాగు వైపు నుంచి తీర్థాల ప్రాంతానికి వెళ్లి వ్యవసాయ పనులు చేసుకునేవారు. అయితే ఆకేరు ప్రవహించే సమయంలో రెండు వైపుల రాకపోకలు నిలిచిపోయి నెలల తరబడి అక్కడే ఉండాల్సిన పరిస్థితులు ఉండేవి.ఈ పరిస్థితుల నేపథ్యంలోనే కొంతకాలానికి తేజావత్ కుటుంబాలు ఊటవాగు తండా, తీర్థాల ప్రాంతాల్లో స్థిర నివాసాలు ఏర్పరుచుకున్నాయి. ఇప్పుడు అదే ఆకేరుపై చెక్‌డ్యాం నిర్మాణం చేపట్టడం వల్ల సాగునీటి సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు గతంలో వాగు కారణంగా ఎదురైన ఇబ్బందులు తగ్గనున్నాయి. ఒకప్పుడు అడ్డుగా నిలిచిన ఆకేరు ఇప్పుడు అభివృద్ధికి దారిగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మారిన స్థిర నివాసాలు...
ముదిగొండ మండలం బాణాపురం తండాకు చెందిన అన్నదమ్ములు ఈశ్వర్, శోభ కుటుంబాలతో కలిసి గతంలో గోళ్లపాడు ప్రాంతానికి కూలీ పనుల కోసం ప్రతి సంవత్సరం వచ్చేవారు. ఈ క్రమంలో అక్కడే గుడిసెలు వేసుకుని నివాసం ఏర్పరుచుకున్నారు. ఊటవాగు సమీపంలో ఉండటంతో ఆ ప్రాంతానికి ఊటవాగు తండా అనే పేరు వచ్చింది.ఆ సమయంలో ప్రస్తుతం చెక్‌డ్యాం నిర్మాణం చేపట్టనున్న ఆకేరు అవతల వైపున ఉన్న తీర్థాల ప్రాంతాలకు వ్యవసాయ అవసరాల కోసం వెళ్లేవారు. ముఖ్యంగా నీరు లేని కాలంలో అక్కడికి వెళ్లిన వారు తిరిగి రావడం కష్టంగా ఉండేది. దీంతో నెలల తరబడి అక్కడే ఉండాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి.కుటుంబాలు విడిపోయి ఒక భాగం ఊటవాగు తండాలో, మరో భాగం తీర్థాల ప్రాంతంలో స్థిరపడింది. కాలక్రమేణా ఈ వలసలు పెరిగి ప్రస్తుతం ఊటవాగు తండాలో సుమారు 60 కుటుంబాలు, తీర్థాల ప్రాంతంలో సుమారు 50 కుటుంబాలు స్థిర నివాసాలు ఏర్పరుచుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
రూ.6.75 కోట్లతో మంత్రి శంకుస్థాపన...
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన చెక్‌డ్యాం శంకుస్థాపన కేవలం అభివృద్ధి పనిగా మాత్రమే కాకుండా దశాబ్దాల చరిత్రను గుర్తు చేసే నిర్ణయంగా స్థానికులు అభివర్ణిస్తున్నారు. గతంలో వాగు దాటి వెళ్లి వ్యవసాయం చేసుకోవాల్సిన పరిస్థితులు ఎదుర్కొన్న రైతుల జీవితాల్లో ఈ ప్రాజెక్టు కొత్త ఆశలు నింపబోతోందని చెబుతున్నారు.సుమారు 250 ఎకరాల ఆయకట్టును దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ నిర్మాణం స్థానిక వ్యవసాయానికి ఉపయోగపడనుందని, దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సాగునీటి సమస్యకు పరిష్కారంగా మారనుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

إرسال تعليق