1965 నాటి కొనుగోలు పత్రాలతో మీడియా ముందుకు కుటుంబ సభ్యులు – సర్వే నంబర్-310 భూమిపై సమగ్ర విచారణ కోరుతూ విజ్ఞప్తి
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన 104 ఏళ్ల వెలుతురు భద్రమ్మ తన కుటుంబ వారసత్వ భూమిని తిరిగి ఇప్పించాలని కోరుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, తన భర్త వెలుతురు చిన్న వెంకయ్య 1965లో కొనుగోలు చేసిన సర్వే నంబర్-310 భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆరోపించారు. తమ కుటుంబానికి చెందిన భూమిని తిరిగి అప్పగించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.ఈ సందర్భంగా భద్రమ్మ కుటుంబ సభ్యులు 1965 నాటి కొనుగోలు పత్రాలు, సర్వే రికార్డులు, వారసత్వానికి సంబంధించిన ఆధారాలు తదితర పత్రాలను మీడియా ముందు ఉంచి, వాటి ప్రతులను విలేకరులకు అందజేశారు. తమ వద్ద ఉన్న పత్రాలు చట్టబద్ధమైనవేనని, అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేపడితే నిజాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.భద్రమ్మ మనవడు వెలుతురు వీరకుమార్ మాట్లాడుతూ, తన తండ్రి అనారోగ్యంతో మృతి చెందిన తర్వాత కుటుంబ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు భూమిని అక్రమంగా తమ పేర్లకు మార్చుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం దొంగ పత్రాలతో భూమిపై హక్కు చెలాయిస్తూ, తాము భూమి వద్దకు వెళ్లినప్పుడల్లా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన ప్రజాదర్బార్లో వినతిపత్రంగా సమర్పించామని, మంత్రి ఆదేశాల మేరకు అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టినప్పటికీ ఇప్పటివరకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోమారు తక్షణమే స్పందించాలని కోరారు . సర్వే నంబర్-310 భూమిపై సమగ్ర విచారణ జరిపి, అక్రమ కబ్జాదారుల నుంచి తమ భూమిని తిరిగి అప్పగించాలని జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని భద్రమ్మ కుటుంబ సభ్యులు కోరారు."నాకు 104 సంవత్సరాలు... కోర్టులు, కార్యాలయాల చుట్టూ తిరిగే శక్తి లేదు. నా భర్త కొనుగోలు చేసిన భూమిని నా కళ్లముందే నాకు ఇప్పించి న్యాయం చేయండి" అంటూ వెలుతురు భద్రమ్మ చేసిన హృదయ విదారక విజ్ఞప్తి సమావేశానికి హాజరైన వారిని భావోద్వేగానికి గురిచేసింది.

إرسال تعليق