ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

రక్తంతో తడుస్తున్న రహదారిపై అధికారుల నిర్లక్ష్యం?


  ప్రమాదం జరిగిన ప్రతిసారి భారీ మూల్యమే

  డివైడర్ లేక గాల్లో కలుస్తున్న ప్రాణాలు...

  ఇప్పటికైనా డివైడర్ ఏర్పాటు చేస్తారా..?

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : ఖమ్మం–సూర్యాపేట ప్రధాన రహదారి... నిత్యం వేలాది వాహనాలు పరుగులు తీసే అత్యంత రద్దీ మార్గం. భారీ లారీలు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, కంటైనర్లు, కార్లు, ద్విచక్ర వాహనాలు ఇలా అన్ని రకాల వాహనాలు నిరంతరం ఈ రహదారిపైనే ప్రయాణిస్తుంటాయి. ఖమ్మం నగరానికి సమీపంలో ఉండటంతో చుట్టుపక్కల గ్రామాలతో పాటు కూసుమంచి , ముదిగొండ, నేలకొండపల్లి మండలం, సూర్యాపేట జిల్లా ప్రాంతాల ప్రజలకు ఇదే ప్రధాన మార్గం.అయితే ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ రహదారిలో కోదాడ క్రాస్ రోడ్ నుంచి వరంగల్ క్రాస్ రోడ్ వరకు డివైడర్ లేకపోవడం ప్రతి రోజూ ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఎదురెదురుగా దూసుకొచ్చే వాహనాలు, అదుపు తప్పిన వేగం, ఓవర్‌టేకింగ్ ప్రయత్నాలు క్షణాల్లోనే ఘోర ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. తాజాగా జరిగిన ఘోర ప్రమాదం ఈ రహదారి ఎంత ప్రమాదకరంగా మారిందో మరోసారి గుర్తు చేసింది. ఏకంగా డీసీఎం డ్రైవర్ తల తెగిపోవడం ప్రమాద తీవ్రతకు అద్దం పట్టింది. అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయినా, కుటుంబాలు రోడ్డున పడినా అధికార యంత్రాంగంలో మాత్రం ఆశించిన చలనం కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ మార్గంలో డివైడర్ ఉంటే ఎదురెదురుగా జరిగే ఢీకొనివేతలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వాహనదారులు, స్థానికులు చెబుతున్నారు. ఎన్నో ప్రమాదాలు జరిగినా శాశ్వత పరిష్కారం మాత్రం కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.ప్రతి ప్రమాదం తర్వాత హామీలు వినిపించడం తప్ప ముందస్తు చర్యలు మాత్రం కనిపించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరెంత మంది ప్రాణాలు కోల్పోతే అధికారులు స్పందిస్తారు? ఈ ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసులో మెదులుతోంది.కోదాడ క్రాస్ రోడ్ నుంచి వరంగల్ క్రాస్ రోడ్ వరకు వెంటనే డివైడర్ నిర్మాణం చేపట్టాలని, అవసరమైన చోట్ల స్ట్రీట్ లైట్లు, హెచ్చరిక బోర్డులు, స్పీడ్ కంట్రోల్ చర్యలు ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.మరో ప్రాణం పోయిన తర్వాత కాదు... ఇప్పుడే స్పందించండి. డివైడర్ ఏర్పాటు చేసి అమాయకుల ప్రాణాలను కాపాడండి.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم