స్నేహితురాలి చివరి చూపు కోసం పాఠశాల ఎదుట ఎదురుచూసిన విద్యార్థులు
14 ఏళ్ల క్రితం కవల సోదరి... ఇప్పుడు వైదికను కోల్పోయిన తల్లిదండ్రులు
ప్రజాపక్షం / ఖమ్మం రూరల్: ఒక మరణం కుటుంబాన్నే కాదు... ఓ వీధిని, ఓ పాఠశాలను, ప్రజలను ఓ చిన్ననాటి జ్ఞాపకాలను శోకసంద్రంలో ముంచెత్తుతాయి. అలాంటి విషాదాన్నే మిగిల్చింది ఓ చిన్నారి. 14 ఏళ్ల అప్పుడు ఆ తల్లిదండ్రులు ఏ చిరునవ్వునైతే కోల్పోయారు ఇప్పుడు అదే చిరునవ్వుకు దూరమయ్యారు.
ఎదులాపురం మున్సిపాలిటీ 28వ వార్డుకు చెందిన రంగిశెట్టి ఉదయ్–స్రవంతి దంపతులకు జన్మించిన కవల ఆడపిల్లల్లో ఒకరు పసిప్రాయంలోనే పేగు సంబంధిత సమస్యతో మృతి చెందారు. అదే సమస్యతో బాధపడుతున్న వైదికను తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు భరిస్తూ, వైద్య చికిత్సలు అందిస్తూ 14 ఏళ్ల వరకు కాపాడుకున్నారు. కానీ విధి మరోసారి అదే కుటుంబాన్ని పరీక్షించింది. చికిత్స పొందుతూ వైదిక కూడా కన్నుమూసింది. ఒకే సమస్యతో ఇద్దరు కుమార్తెలను కోల్పోయిన ఆ తల్లిదండ్రుల రోదన చూసి పలువురు కంటతడి పెట్టారు.
చివరి చూపు కోసం ఎదురు చూసిన స్నేహితులు...
ఎదులాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న వైదికకు స్నేహితులు అంటే ఎంతో ఇష్టం. వారితో కలిసి నవ్వుతూ, ఆడుకుంటూ, చదువుకుంటూ గడిపిన రోజులు ఇప్పుడు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి.ఆమె అంతిమయాత్ర పాఠశాల సమీపానికి వస్తోందని తెలిసిన విద్యార్థులు సాయంత్రం వరకు అక్కడే వేచి ఉన్నారు. వాహనం కనిపించగానే పరుగెత్తుకుంటూ వెళ్లి తమ స్నేహితురాలికి చివరిసారి వీడ్కోలు పలికారు. కడసారి ముఖం చూసిన క్షణంలో పలువురు విద్యార్థులు బోరున విలపించారు. అక్కడున్న ఉపాధ్యాయులు, ప్రజలు కూడా ఆ దృశ్యాన్ని చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.


إرسال تعليق