ప్రియదర్శినిలో సినీ సందడి.. 'శ్రీనివాస మంగాపురం' మూవీ ప్రమోషన్స్‌కు విద్యార్థుల విశేష స్పందన
హీరో గట్టమనేని జయకృష్ణ, దర్శకుడు అజయ్ భూపతికి ఘన స్వాగతం
ప్రజాపక్షం / ఖమ్మం రూరల్:ఖమ్మం రూరల్ మండలంలోని ప్రియదర్శిని మహిళల ఇంజనీరింగ్ కళాశాల (అటానమస్) సోమవారం సినీ సందడితో కళకళలాడింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న తెలుగు చిత్రం 'శ్రీనివాస మంగాపురం' మూవీ ప్రమోషన్ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించగా, విద్యార్థుల ఉత్సాహభరిత స్పందనతో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది.ఈ సందర్భంగా చిత్ర హీరో గట్టమనేని జయకృష్ణ, దర్శకుడు అజయ్ భూపతి కళాశాలను సందర్శించి విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించారు. సినిమా విశేషాలను పంచుకుంటూ, చిత్రాన్ని ఆదరించి విజయవంతం చేయాలని విద్యార్థులను కోరారు. సినీ ప్రముఖులతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం దక్కడంతో విద్యార్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ సెల్ఫీలు, ఫొటోలు దిగారు.కళాశాల చైర్మన్ కాటేపల్లి నవీన్ బాబు ముఖ్య అతిథులకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. యువతను ఆకట్టుకునే వినోదంతో పాటు మంచి సందేశాన్ని అందించే చిత్రాలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. సినీ ప్రముఖులు విద్యార్థులతో మమేకం కావడం వారికి కొత్త ఉత్సాహాన్ని, స్ఫూర్తిని కలిగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. బత్తుల గోపాల్, అకాడమిక్ డైరెక్టర్ ఆట్లూరి వెంకటరమణ, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, కల్చరల్ ఇన్చార్జ్ ఆర్.వి.ఎన్. ప్రసాద్, బోధనేతర సిబ్బంది, భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
విద్యార్థుల కేరింతలు, చప్పట్ల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో సాగిన ఈ ప్రమోషన్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. తమకు ఆతిథ్యం అందించిన ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులకు సినీ బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.


إرسال تعليق