ఖమ్మం–కొరవి రహదారి నుంచి లారీల్లో భారీగా మట్టి తరలింపు
ఆదివారం కావడంతో అధికారుల పర్యవేక్షణ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకున్న మాఫియా?
ప్రభుత్వ ఆదాయానికి గండి.. చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్
ప్రజాపక్షం / ఖమ్మం రూరల్:ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఖమ్మం–వరంగల్ బైపాస్ రోడ్డుపై ఎర్రమట్టి అక్రమ తరలింపు మళ్లీ జోరందుకుంది. బైపాస్కు ఆనుకుని ఉన్న ఖాళీ ప్లాట్లలో భారీ యంత్రాల సహాయంతో ఎర్రమట్టిని నింపుతూ లారీల ద్వారా పెద్ద ఎత్తున తరలిస్తున్నారు.ఖమ్మం–కొరవి రహదారి పరిసర ప్రాంతాల నుంచి మట్టిని తీసుకొచ్చి ప్లాట్లలో పోస్తుండగా, ఈ పనులు ఎలాంటి అనుమతులతో జరుగుతున్నాయనే అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం కావడంతో సంబంధిత అధికారులు అందుబాటులో ఉండరనే భావనతో మట్టి మాఫియా మరింత రెచ్చిపోతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.ప్రకృతి సంపదను విచ్చలవిడిగా తరలించడం వల్ల పర్యావరణానికి నష్టం కలగడమే కాకుండా, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి కూడా గండి పడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ మట్టి తవ్వకాలు, రవాణాపై సంబంధిత అధికారులు వెంటనే విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

إرسال تعليق