మున్సిపల్ పాలన, పట్టణాభివృద్ధి, ప్రభుత్వ పథకాలపై అవగాహన
ప్రజాపక్షం / ఖమ్మం రూరల్: ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించడంతో పాటు మున్సిపల్ పాలనపై ప్రజాప్రతినిధుల అవగాహన పెంపొందించేందుకు హైదరాబాద్‌లో సిడిఎంఏ (కమిషనరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) ఆధ్వర్యంలో, ఎన్ఐయూఎం, ఎస్సిఐ సంయుక్తంగా నిర్వహిస్తున్న మూడో బ్యాచ్ శిక్షణ కార్యక్రమంలో ఎదులాపురం మున్సిపాలిటీకి చెందిన 32 మంది కౌన్సిలర్లు శుక్రవారం పాల్గొన్నారు. అలాగే సిపిఐ కౌన్సిలర్లు 28వ వార్డు దండి రంగారావు, 30వ వార్డు కౌన్సిలర్ దండి శ్రీజ, 31వ వార్డు కౌన్సిలర్ మామిండ్ల శ్రీనాథ్ రెడ్డి ఈ శిక్షణలో పాల్గొని పలు అంశాలపై అవగాహన పెంపొందించుకున్నారు.శిక్షణలో మున్సిపల్ పాలన, పట్టణాభివృద్ధి ప్రణాళికలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలు, టౌన్ ప్లానింగ్, పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, పన్నుల వసూళ్లు, పౌర సేవల మెరుగుదల, స్థానిక సంస్థల బాధ్యతలు, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధుల పాత్ర తదితర అంశాలపై నిపుణులు వివరించారు. అలాగే మున్సిపాలిటీలలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, పారదర్శక పరిపాలన, ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధానాలపై కూడా శిక్షణ ఇచ్చారు.ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ, ఈ శిక్షణ ద్వారా మున్సిపల్ పరిపాలనపై సమగ్ర అవగాహన లభించిందని, తమ వార్డుల్లో అభివృద్ధి పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. శిక్షణలో పాల్గొనే అవకాశం కల్పించేందుకు ప్రత్యేక చొరవ చూపిన ఎదులాపురం మున్సిపల్ కమిషనర్‌కు ఆళ్ల శ్రీనివాస్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

إرسال تعليق