దేశ యువత భవిష్యత్తును నాశనం చేసిన కేంద్ర ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు
పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
ఏదులాపురంలో కాంగ్రెస్ భారీ నిరసన.. మోదీ దిష్టిబొమ్మ దహనం
ప్రజాపక్షం/ ఖమ్మం రూరల్ : పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగ యువత కలలను ఛిద్రము చేసిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాల గొంతును నొక్కే ప్రయత్నం చేస్తోందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగుల తరఫున న్యాయం కోరిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అక్రమంగా అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమేనని ఆయన అన్నారు.రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ బుధవారం ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సత్యనారాయణపురం రాంలీలా ఫంక్షన్ హాల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల గుండా సాగి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తింది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా తుంబూరు దయాకర్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో పోటీ పరీక్షలు నిర్వహించే వ్యవస్థ పూర్తిగా గాడితప్పిందని ఆరోపించారు. సంవత్సరాల తరబడి కష్టపడి చదివిన విద్యార్థుల శ్రమను ప్రశ్నాపత్రాల లీకేజీలు నీరుగార్చాయని, నిరుద్యోగ యువతలో తీవ్ర నిరాశ, ఆవేదన నెలకొన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా స్పందించలేదని విమర్శించారు. పరీక్షల్లో పారదర్శకతను కాపాడడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.విద్యార్థుల సమస్యలను పార్లమెంట్లోనూ, ప్రజాక్షేత్రంలోనూ లేవనెత్తిన రాహుల్ గాంధీపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. ప్రజల తరఫున ప్రశ్నించే నాయకులను అరెస్టు చేయడం ద్వారా ప్రజల గొంతును అణచివేయలేరని, కాంగ్రెస్ పార్టీ ప్రజల హక్కుల కోసం ఎప్పటికీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.దేశ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం, పరీక్షల నిర్వహణలో కూడా విఫలమై యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిందని మండిపడ్డారు. పేపర్ లీకేజీలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.అరెస్టులు, అక్రమ కేసులు, బెదిరింపులతో కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గదని, విద్యార్థులు, నిరుద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం రాహుల్ గాంధీ నాయకత్వంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తుంబూరు దయాకర్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ఖమ్మం రూరల్ మండల, ఏదులాపురం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


إرسال تعليق