ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

రాహుల్ గాంధీ అరెస్టు.. విద్యార్థులపై పోలీసుల దాడులను ఖండిస్తూ వైరాలో కాంగ్రెస్ భారీ నిరసన


మోడీ దిష్టిబొమ్మ దహనం..

కేంద్ర ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అగ్రాహం

ప్రజాపక్షం/వైరా:ఢిల్లీలో విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన నిరసనను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం, విద్యార్థులు, ముఖ్యంగా మహిళా విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆధ్వర్యంలో బుధవారం వైరా రింగ్ రోడ్డులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తమ నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ, దేశ భవిష్యత్తును నిర్మించే విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తీవ్రంగా విమర్శించారు. నీట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో పేపర్ లీక్‌లు చోటుచేసుకోవడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ఇలాంటి ఘటనలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం, సమస్యను పక్కనబెట్టి నిరసన తెలుపుతున్న విద్యార్థులను, వారికి అండగా నిలుస్తున్న ప్రతిపక్ష నాయకులను పోలీసులతో అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కల్పించిందని, ఆ హక్కును వినియోగించుకుంటున్న విద్యార్థులపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమేనని అన్నారు. ముఖ్యంగా మహిళా విద్యార్థుల పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు అత్యంత బాధాకరమని, మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన పోలీసులు వారిపైనే దురుసుగా వ్యవహరించడం సమర్థనీయం కాదన్నారు.దేశ భవిష్యత్తు కోసం చదువుకుంటున్న విద్యార్థులు తమ హక్కులను కాపాడాలని, పరీక్షా వ్యవస్థలో పారదర్శకత కోరుతూ ఉద్యమిస్తుంటే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేయడం కేంద్ర ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 16 ఏళ్ల విద్యార్థినిపై పోలీసులు ప్రవర్తించిన తీరు దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు గురవుతోందని, ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య భారతదేశానికి మచ్చ తెచ్చేవని అన్నారు.విద్యార్థుల సమస్యలను పార్లమెంట్ నుంచి ప్రజల మధ్య వరకు తీసుకెళ్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం దుర్మార్గ చర్య అని ఆయన ఖండించారు. నీట్ పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని, పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.విద్యార్థుల భవిష్యత్తు రాజకీయాలకు అతీతమైన అంశమని, వారిపై జరుగుతున్న అన్యాయాన్ని ఎప్పటికీ సహించబోమని కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే రాందాస్ నాయక్ స్పష్టం చేశారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ బుర్ర రాజశేఖర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ బోళ్ళ గంగారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ల సంతోష్, జిల్లా కాంగ్రెస్ మెడికల్ సెల్ అధ్యక్షుడు డాక్టర్ కాపా మురళీకృష్ణ, కౌన్సిలర్లు పణితి సైదులు, మోరు శ్రీకాంత్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ముల్లపాటి సీతారాములు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏదునూరు సీతారాములు, పమ్మి అశోక్, రత్నం, వీరంశెట్టి సీతారాములు, ధర్నా రాజశేఖర్, ఉండ్రు శ్యాంబాబు, చెరుకూరి కిరణ్, జవ్వాజి నాగరాజు, పాలేటి నరసింహారావు, రేచర్ల రాముడు, దురిశెట్టి నరసింహారావు తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది