ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విశ్రాంత ఉద్యోగి మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమా?


 కుటుంబ సభ్యుల ఆరోపణలు.. ఆసుపత్రి వివరణతో మిస్టరీ మరింత ముదిరింది

ప్రజాపక్షం/ఖమ్మం వైద్య విభాగం:ఖమ్మం నగరంలోని దానవాయిగూడెంకు చెందిన విశ్రాంత ఉద్యోగి బలుసు బాబూరావు (68) ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం తీవ్ర విషాదానికి దారితీసింది. గాల్‌బ్లాడర్‌లో రాళ్ల సమస్యతో మూడు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన ఆయన, శస్త్రచికిత్సకు ముందు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

శస్త్రచికిత్సకు ముందు ఏం జరిగింది?

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, వైద్యులు గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నాయని నిర్ధారించి శస్త్రచికిత్స అవసరమని తెలిపారు. మంగళవారం ఆపరేషన్‌కు సిద్ధం చేసి బాబూరావును ఆపరేషన్ థియేటర్‌కు తరలించారు. అయితే కొద్దిసేపటికే ఆయన మృతి చెందినట్లు సమాచారం అందిందని వారు తెలిపారు.కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం, అవసరానికి మించిన మత్తుమందు (అనస్థీషియా) ఇవ్వడం వల్ల పరిస్థితి విషమించి గుండెపోటు వచ్చిందని, అనంతరం రక్తం అవసరమని ఆసుపత్రి సిబ్బంది తమను సంప్రదించారని పేర్కొన్నారు. సాధారణ శస్త్రచికిత్స కోసం వెళ్లిన వ్యక్తి అనూహ్యంగా మృతి చెందడం అనేక అనుమానాలకు తావిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆసుపత్రి ఎదుట ఆందోళన

ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగేందుకు ప్రయత్నించగా పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. బాధితులు లిఖితపూర్వక ఫిర్యాదు చేస్తే చట్టపరంగా సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.

సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్

ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్లినప్పటి నుంచి మరణం ప్రకటించే వరకు జరిగిన ప్రతి అంశాన్ని విచారించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ, అనస్థీషియా రికార్డులు, కేస్‌షీట్, వైద్యుల నోట్స్ తదితర పత్రాలను స్వాధీనం చేసుకుని స్వతంత్ర వైద్య నిపుణుల కమిటీతో దర్యాప్తు జరపాలని కోరుతున్నారు. నిర్లక్ష్యం తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

ఆసుపత్రి యాజమాన్యం ఏమంటోంది?

మరోవైపు, శస్త్రచికిత్స సమయంలో గుండెపోటు రావడం వల్లే బాబూరావు మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వైద్యుల నిర్లక్ష్యం ఏమీ లేదని, అన్ని వైద్య ప్రమాణాలను పాటించామని స్పష్టం చేశాయి.

రాత్రి వరకు చర్చలు.. పరిష్కారం లేదు

బాధిత కుటుంబ సభ్యులు, ఆసుపత్రి యాజమాన్యం మధ్య రాత్రి వరకు చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి పరిష్కారం లభించలేదు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత కొనసాగగా, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.


«గమనిక: ఈ ఘటనలో కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యంపై ఆరోపణలు చేయగా, ఆసుపత్రి యాజమాన్యం వాటిని ఖండించింది. వాస్తవాలు అధికారిక దర్యాప్తు అనంతరం మాత్రమే తేలనున్నాయి.»

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم