10 మందిపై కేసులు నమోదు.. సంబంధిత అధికారిపై విచారణ: ఎఫ్డీఓ బాబు
అపోహలు, తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి
ప్రజాపక్షం / అశ్వాపురం: మణుగూరు రేంజ్ పరిధిలోని మనుబోతులగూడెం గ్రామపంచాయతీ నాగేశ్వరావు గుంపు వద్ద శుక్రవారం చోటుచేసుకున్న ఘటనపై అటవీశాఖ అధికారులు శనివారం అశ్వాపురం రేంజ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎఫ్డీఓ బి. బాబు మాట్లాడుతూ ఘటనకు సంబంధించి 10 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై విచారణ కొనసాగుతోందని, ఇందులో సంబంధిత అటవీ అధికారిపై కూడా శాఖాపరమైన విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.అటవీ భూముల ఆక్రమణలు, అక్రమ కలప రవాణా, అడవుల విధ్వంసాన్ని అరికట్టేందుకు చట్టబద్ధమైన చర్యలు మాత్రమే తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అడవుల సంరక్షణలో ప్రజల సహకారం అత్యంత అవసరమని పేర్కొంటూ, అటవీశాఖ సిబ్బంది ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారని చెప్పారు.మనుబోతులగూడెం ఘటనపై సామాజిక మాధ్యమాలు, ఇతర వేదికల ద్వారా ప్రచారంలో ఉన్న అపోహలు, తప్పుడు సమాచారాన్ని ఎవరూ నమ్మవద్దని ఎఫ్డీఓ బాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వాస్తవాల ఆధారంగా మాత్రమే స్పందించాలని సూచించారు.ప్రభుత్వం చేపడుతున్న హరితహారం, అటవీ పునరుద్ధరణ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొంటూ, ప్రజల సహకారంతోనే అడవులను పరిరక్షించి భావితరాలకు పచ్చని తెలంగాణను అందించగలమని అన్నారు.ఈ విలేకరుల సమావేశంలో మణుగూరు రేంజర్ ఉపేందర్, అశ్వాపురం రేంజర్ ఆలీతో పాటు అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

إرسال تعليق