కార్మిక, రైతు వ్యతిరేక విధానాలపై పోరాటం ఉధృతం చేయాలి
సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి, పాలేరు డివిజన్ కార్యదర్శి బందెల వెంకయ్య
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 10న నిర్వహించే జైల్‌భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి, పాలేరు డివిజన్ కార్యదర్శి బందెల వెంకయ్య పిలుపునిచ్చారు. శనివారం ఖమ్మం రూరల్ మండలం కాచిరాజు గూడెం లో ఈ మేరకు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా విధానాలను రూపొందిస్తూ కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలపై భారాలు మోపుతోందని విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి గతంలో అమల్లో ఉన్న 44 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రైతులు పెట్టుబడులు పెట్టి పంటలు పండించినప్పటికీ గిట్టుబాటు ధర లభించక దళారుల దోపిడీకి గురవుతున్నారని అన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించే విధానాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే చర్యలను ఉపసంహరించుకోవాలని కోరారు.కేంద్ర ప్రభుత్వ విధానాలతో విద్యార్థులు, నిరుద్యోగులు, చేతివృత్తిదారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు తమ హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఆగస్టు 10న ఖమ్మం జిల్లా పరిషత్ సెంటర్ నుంచి ఇల్లందు క్రాస్‌రోడ్ వరకు నిర్వహించే భారీ ప్రదర్శనలో అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జైల్‌భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా సెక్రటేరియట్ సభ్యులు రేపాకుల శివలింగం, జిల్లా కమిటీ సభ్యులు మలీదు నాగేశ్వరరావు, తిమ్మిడి హనుమంతరావు, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం పాలేరు డివిజన్ ఉపాధ్యక్షులు ఏర్ల వెంకట అప్పారావు, మల్లాది వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి