ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: జాతీయ జెండా రెపరెపలాడింది.. దేశభక్తి నినాదాలు మార్మోగాయి.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ఖమ్మం రూరల్ మండలం, ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీలు, మున్సిపల్ వార్డులు, విద్యాసంస్థల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించి స్వాతంత్ర్య స్ఫూర్తిని చాటుకున్నారు. రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ వినయేందర్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రవికుమార్, ఖమ్మం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ తిరుపతిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎదులాపురం మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ పోకబత్తిని అనిత జాతీయ జెండాను ఆవిష్కరించారు. గ్రామపంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు, మున్సిపల్ వార్డుల్లో కౌన్సిలర్లు జెండాలను ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పలుచోట్ల విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటారు.ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ ఆర్ఐ జానీ, డీటీ రవీందర్, అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
28వ వార్డులో జెండా ఆవిష్కరించిన సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్
వరంగల్ క్రాస్‌రోడ్డు 28వ వార్డులోని రైజింగ్ కిడ్స్ స్కూల్లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించి ఆకట్టుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ సమైక్యత, సౌభ్రాతృత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
హ్యాపీ కిడ్స్, మహదేవ్ జిమ్ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీ
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా వరంగల్ క్రాస్ రోడ్లో హ్యాపీ కిడ్స్ స్కూల్, మహదేవ్ జిమ్ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీలు నిర్వహించారు. హ్యాపీ కిడ్స్ స్కూల్ చిన్నారులు జాతీయ జెండాలను చేతబూని పాఠశాల నుంచి వరంగల్ క్రాస్ రోడ్ వరకు ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. చిన్నారుల దేశభక్తి నినాదాలతో పరిసర ప్రాంతం మార్మోగింది. అదేవిధంగా మహదేవ్ జిమ్ నిర్వాహకుడు పృథ్వి ఆధ్వర్యంలో వరంగల్ క్రాస్ రోడ్ సెంటర్లో జాతీయ జెండాల రెపరెపల మధ్య ర్యాలీ నిర్వహించారు. యువత దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ జాతీయ సమైక్యత, దేశభక్తిని చాటేలా కార్యక్రమాన్ని నిర్వహించారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి