ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

విద్యార్థుల్లో సైబర్ భద్రతపై అవగాహన పెరగాలి


అప్రమత్తతే సైబర్ నేరాల నుంచి రక్షణ: ప్రిన్సిపాల్ లింగంనేని నళిని శ్రీ

ప్రజాపక్షం/బోనకల్: డిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే ప్రతి విద్యార్థి సైబర్ భద్రతపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లింగంనేని నళిని శ్రీ అన్నారు. కళాశాలలో ఎన్‌ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైబర్ నేరాలపై అవగాహన సదస్సుకు ఆమె అధ్యక్షత వహించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియా వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు. ఓటీపీ, ఏటీఎం పిన్, పాస్‌వర్డ్ వంటి గోప్యమైన వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు తెలియజేయకూడదని సూచించారు. తెలియని వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయకుండా, సోషల్ మీడియాలో అపరిచితులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని హెచ్చరించారు. సైబర్ మోసాలు లేదా ఆన్‌లైన్ వేధింపులు ఎదురైన వెంటనే భయపడకుండా 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. విద్యార్థులు ఓటీపీలు అడిగి మోసాలు చేయడం, నకిలీ లింకుల ద్వారా డబ్బులు దోచుకోవడం, సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేయడం, ఫేక్ ప్రొఫైళ్లతో వేధించడం, ఆన్‌లైన్ గేమ్స్, పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడే విధానాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. "మీరు ఎంత అప్రమత్తంగా ఉంటే సైబర్ నేరాలకు అంత దూరంగా ఉంటారు. మీ ఒక్క నిర్లక్ష్యం మీ కుటుంబానికి ఆర్థిక, మానసిక నష్టాన్ని కలిగించవచ్చు" అని నళిని శ్రీ విద్యార్థులకు సూచించారు. అనంతరం బోనకల్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రామచంద్ర సైబర్ నేరాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి, అనుమానాస్పద కాల్స్, లింకులు, సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ అంతోటి తిరుపతిరావు, అధ్యాపకులు జోనతాన్ బాబు, రాజేంద్ర కుమార్, లక్ష్మీకాంతం, పద్మావతి, రామకృష్ణ, రమేష్, రాజేంద్ర, ప్రియ కుమార్ రెడ్డి, మురళీకృష్ణ, యశోద, శాంతిప్రియ, లైబ్రేరియన్ మోహన్, యూడీసీ మదర్ సాహెబ్, జశ్వంత్, బుజ్జమ్మ అరుణతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది