ఖమ్మం రూరల్ మండల వ్యవసాయ అధికారి జె. ఉమా నగేష్
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : రైతులకు ఎరువుల సరఫరాను మరింత పారదర్శకంగా, సులభంగా, క్రమబద్ధంగా అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన Framework for Fertilizer Sale (FFS) విధానాన్ని ఆగస్టు 7, 2026 నుంచి ఖమ్మం రూరల్ మండలంలోని అన్ని ఎరువుల విక్రయ కేంద్రాల్లో అమలు చేయనున్నట్లు మండల వ్యవసాయ అధికారి జె. ఉమా నగేష్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విధానంలో రైతులు యూరియా, డీఏపీ, ఎంఓపీ, కాంప్లెక్స్ ఎరువులు సహా అన్ని రకాల ఎరువులను FFS మొబైల్ యాప్ ద్వారా ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. రైతులు ఆధార్ నంబర్, OTP ద్వారా యాప్‌లో లాగిన్ అయి, తమ భూమి వివరాలను ధృవీకరించుకుని, అవసరమైన పంట, ఎరువు రకం, పరిమాణం, సమీపంలోని అధీకృత ఎరువుల డీలర్‌ను ఎంపిక చేసి బుకింగ్ పూర్తి చేయాలి. బుకింగ్ పూర్తయిన అనంతరం రైతులకు QR కోడ్‌తో కూడిన బుకింగ్ ఐడీ లభిస్తుంది. ఎంపిక చేసిన ఎరువుల విక్రయ కేంద్రంలో ఆ QR కోడ్‌ను PoS యంత్రం ద్వారా స్కాన్ చేసి, e-KYC పూర్తి చేసిన తర్వాత ఎరువులను పొందవచ్చని తెలిపారు. ఈ విధానం వల్ల ఎరువుల పంపిణీలో పారదర్శకత పెరగడంతో పాటు, రైతులు దుకాణాల వద్ద ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం తగ్గుతుందని పేర్కొన్నారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, అవసరమైన ఎరువులను ముందుగానే FFS యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని సూచించారు.అలాగే మండలంలోని అన్ని ఎరువుల డీలర్లు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం FFS విధానం ద్వారానే ఎరువుల విక్రయాలు నిర్వహించాలని ఆదేశించారు. రైతులకు ఏవైనా సందేహాలు లేదా సాంకేతిక సమస్యలు ఎదురైతే సమీప వ్యవసాయ విస్తరణ అధికారిని లేదా మండల వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి