ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

మన్నించు.. మారెమ్మ!


 ఆక్రమణలతో పాదచారులకు ఇక్కట్లు.. రోడ్డుపైనే లారీల నిలిపివేత.. టోకెన్‌ తర్వాతా అదనపు వసూళ్ల ఆరోపణలు

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మారెమ్మ గుడి వద్ద భక్తులకు పలు సమస్యలు ఎదురవుతున్నాయని భక్తులు, స్థానికులు పేర్కొంటున్నారు. భక్తులకు కొంగుబంగారంగా నిలిచే అమ్మవారి వద్ద సాగుతున్న వ్యవహారాలపై ఆవేదన సైతం వ్యక్తం చేస్తున్నారు.  ఆలయం ఎదురుగా ఉన్న సైడ్‌ డ్రైన్‌ను కొన్ని ఫంక్షన్‌ హాళ్లు, వ్యాపారులు ఆక్రమించడంతో పాదచారులకు నడిచే మార్గం లేకుండా పోయిందని అంటున్నారు. దీంతో భక్తులు, స్థానికులు రోడ్డుపైనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని చెబుతున్నారు.  ప్రతి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తుండటంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది. భారీ లారీలను రోడ్డుపైనే నిలిపి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో పాటు భక్తులు, పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ఆలయానికి వచ్చే వాహనాలకు ప్రత్యేక పార్కింగ్‌ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. ఇదిలా ఉండగా.. ఆలయానికి వచ్చే వాహనాల విషయంలో వాహనం రకాన్ని బట్టి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు భక్తుల నుంచి వినిపిస్తున్నాయి. గతంలో ఇదే అంశంపై ఫిర్యాదులు రావడంతో టోకెన్‌ విధానం ప్రవేశపెట్టినప్పటికీ, ప్రస్తుతం టోకెన్‌ తీసుకున్న తర్వాత కూడా అదనంగా డబ్బులు సమర్పించుకోవాల్సి వస్తోందని కొందరు భక్తులు వాపోతున్నారు. వాహనాల పేరుతో వసూలు చేస్తున్న మొత్తాలపై పారదర్శకత ఉండాలని వారు కోరుతున్నారు.

ఒకవైపు సైడ్‌ డ్రైన్‌ల ఆక్రమణలు.. మరోవైపు రోడ్డుపైనే భారీ వాహనాల నిలిపివేత.. ఇంకోవైపు వాహనాల పేరుతో అదనపు వసూళ్ల ఆరోపణలు భక్తులను ఆవేదనకు గురిచేస్తున్నాయి. ఆలయ పరిసరాల్లోని ఆక్రమణలను వెంటనే తొలగించి పాదచారులకు నడిచే మార్గం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.ఆదివారాల్లో ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టి, భారీ వాహనాలను రోడ్డుపై నిలిపివేయకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు. అలాగే టోకెన్‌ విధానం అమలు తీరును అధికారులు పరిశీలించి, అదనపు వసూళ్ల ఆరోపణలపై విచారణ చేపట్టి పారదర్శకమైన విధానం అమలు చేయాలని భక్తులు కోరుతున్నారు. మారెమ్మ సన్నిధిలో భక్తులకు ఎదురవుతున్న సమస్యలపై ఏదులాపురం మున్సిపల్‌ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తక్షణమే స్పందించి ఆక్రమణలు తొలగించడంతో పాటు ట్రాఫిక్‌, పార్కింగ్‌, వసూళ్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది