ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

కాలవడ్డుపై ఎగసిపడిన ఎర్ర కెరటాలు


 

ఎర్రజెండాల రెపరెపలతో ఎరుపు రంగు పులుముకున్న పురవీధులు

అట్టహాసంగా ప్రజా చైతన్య యాత్ర ముగింపు వేడుకలు

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: “బదలావు జరూరి.. హై మార్పు కావాలి” అనే నినాదాలతో ఖమ్మం నగర పురవీధులు ఎర్రదనంతో మార్మోగాయి. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ కమిటీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర ముగింపు కార్యక్రమం ఖమ్మంలో అట్టహాసంగా జరిగింది. ఎర్రజెండాల రెపరెపలు, జై సీపీఐ నినాదాలు, కళాకారుల నృత్యాలు, డప్పుల దరువులతో యాత్ర సాగిన తీరు నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రజా సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, మార్పు ఆవశ్యకతను చాటిచెప్పడం, సామాజిక న్యాయం కోసం ప్రజలను చైతన్యపరచడం లక్ష్యంగా నిర్వహించిన ఈ యాత్రలో సీపీఐ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మూడు మార్గాల్లో చేపట్టిన యాత్రల్లో భాగంగా యాత్ర–1 కాలవొడ్డుపై నుంచి సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా ప్రారంభమైంది. యాత్ర ప్రారంభానికి ముందు సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మౌలానా ఎర్రజెండా ఊపి యాత్రను ప్రారంభించారు. అనంతరం కాలవొడ్డి నుంచి బయలుదేరిన ఎర్రదండు గాంధీ చౌక్ వైపు కదిలింది. అడుగడుగునా ఎర్రజెండాలు రెపరెపలాడగా, “జై సీపీఐ”, “బదలావు జరూరి.. మార్పు కావాలి” అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో పరిసర ప్రాంతాలు హోరెత్తాయి. గాంధీ చౌక్ మీదుగా సాగిన యాత్ర మధ్యగేటు నుంచి కమాన్ బజార్‌లోకి ప్రవేశించింది. అక్కడి నుంచి పాత మున్సిపాలిటీ కార్యాలయం రోడ్డు మీదుగా బస్టాండ్ వైపు కొనసాగింది. యాత్రలో పాల్గొన్న సీపీఐ నాయకులు, కార్యకర్తలు ఎర్రజెండాలను చేతబూని ముందుకు సాగుతుండగా, వారి వెనుక భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో ప్రధాన రహదారులు ఎరుపు రంగు పులుముకున్నట్లుగా కనిపించాయి. యాత్రలో పాల్గొన్న కళాకారుల నృత్యాలు, డప్పుల దరువులు, విప్లవ గీతాలు కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి. ఎర్రజెండాల రెపరెపలు, నినాదాల హోరు, డప్పుల మోతతో కాలవొడ్డి నుంచి బస్టాండ్ వరకు సాగిన యాత్ర సీపీఐ శ్రేణుల బలప్రదర్శనగా కనిపించింది.

ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సీపీఐ ప్రజా చైతన్య యాత్ర ముగింపు సందర్భంగా పార్టీ శ్రేణులు భారీగా తరలిరావడంతో నగరంలో ఎర్ర కెరటాలు ఎగసిపడిన వాతావరణం నెలకొంది. ప్రజా ఉద్యమాలకు సీపీఐ ఎప్పటికీ అండగా ఉంటుందని, మార్పు కోసం ప్రజలను ఐక్యం చేస్తామని నాయకులు పిలుపునిచ్చారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది