గ్రానైట్ లారీ డ్రైవర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : ఖమ్మం జిల్లా ఆర్థిక, నిర్మాణ రంగానికి గ్రానైట్ పరిశ్రమ వెన్నుముకగా నిలుస్తోందనీ,రాత్రింబవళ్లు ప్రాణాలను పణంగా పెట్టి, వేల టన్నుల గ్రానైట్ రాళ్లను సురక్షితంగా చేరవేసే లారీ డ్రైవర్ల జీవితాలు మాత్రం తీవ్ర అభద్రతలో కూరుకుపోయాయని ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు అన్నారు . యాజమాన్యంను, ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఏదులాపురం మున్సిపాలిటీలోని 31వ డివిజన్లో లో గ్రానైట్ లారీ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ సమావేశాన్ని 28వ వార్డు కౌన్సిలర్ దండి రంగారావు అధ్యక్షతన జైపాల్ రెడ్డి సారధ్యంలో నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...క్వారీ యజమానుల నిర్లక్ష్యం, సరైన రక్షణ చర్యలు లేకపోవడం మరియు రవాణా రంగంలో పెరుగుతున్న భారాల వల్ల గ్రానైట్ లారీ డ్రైవర్లు, క్లీనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.క్వారీలలో పరిమితికి మించి (ఓవర్ లోడింగ్) రాళ్లను లారీలలో లోడ్ చేయడం వల్ల వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయనీ, దీనివలన డ్రైవర్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లడమే కాకుండా, ఆర్టీఏ అధికారుల భారీ జరిమానాలు డ్రైవర్లపైనే పడుతున్నాయనీ కావున దీనిపై ప్రభుత్వాలు దృష్టి సారించాలన్నారు.నిర్దిష్టమైన పని గంటలు లేక, తగినంత విశ్రాంతి లేక డ్రైవర్లు తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నారనీ, పనికి తగ్గ సరైన వేతనాలు మరియు భత్యాలు (బేటా) చెల్లించాలన్నారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు డ్రైవర్లు మరణించినా లేదా అంగవైకల్యం పొందినా వారి కుటుంబాలకు క్వారీ యజమానులు మరియు రవాణా సంస్థలు రూ. 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ మరియు తక్షణ పరిహారం అందించాలన్నారు. గ్రానైట్ క్వారీల వద్ద మరియు లోడింగ్ పాయింట్ల వద్ద డ్రైవర్లు వేచి ఉండేందుకు కనీస తాగునీరు, నీడ, విశ్రాంతి గదులు మరియు మరుగుదొడ్ల వసతి కల్పించాలన్నారు.గేట్ పాస్లు, లీగల్ పత్రాలు అన్నీ సరిగ్గా ఉన్నప్పటికీ, చెక్ పోస్టుల వద్ద మరియు మార్గమధ్యంలో లారీ డ్రైవర్లను వేధించడం వెంటనే ఆపాలన్నారు.ప్రభుత్వం మరియు సంబంధిత శాఖల అధికారులు, గ్రానైట్ క్వారీ/క్లస్టర్ యజమానులు వెంటనే స్పందించి, లారీ డ్రైవర్ల సంఘాల నాయకులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నా. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా గ్రానైట్ లారీల రవాణాను నిలిపివేసి భారీ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎదులాపురం మున్సిపాలిటీ 30 వార్డ్ కౌన్సిలర్ దండి శ్రీజ , సంఘం అధ్యక్షులు బండారు మధు, ఉపాధ్యక్షులు కుంట శ్రీను , చందావత్ నగేష్, ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాజు , కార్యదర్శి చించేటి ఉపేందర్, కోశాధికారి కోళ్ల సురేష్* తదితరులు పాల్గొన్నారు.


إرسال تعليق