అర్థరాత్రి దాబాలో చొరబడి చోరీ.. మద్యం కనిపించడంతో అక్కడే మకాం వేసిన మందుబాబులు
ఉదయం 8.30 గంటల వరకు ‘మత్తులో మునిగి’.. ఓనర్ వచ్చేసరికి పోలీసులకు చిక్కిన వైనం
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: దొంగతనానికి వచ్చారు.. విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు.. కానీ అక్కడే కనిపించిన మద్యం మాత్రం వారిని కదలనివ్వలేదు. చివరకు ఉదయం వరకు దాబాలోనే మకాం వేసి పోలీసులకు పట్టుబడ్డారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఖమ్మం–కొరవి రహదారి సమీపంలోని రమేష్ దాబాలో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా ఆసక్తికరంగా మారింది. అర్థరాత్రి సమయంలో దాబాలోకి చొరబడిన దొంగలు తలుపులు పగలగొట్టి లోపల ఉన్న విలువైన సామగ్రిని తరలించినట్లు సమాచారం. అయితే దాబాలో పెద్ద మొత్తంలో మద్యం కనిపించడంతో అసలు పని పక్కనపెట్టి ‘మందు సేవలో’ మునిగిపోయారు. ఒక్కరాత్రి చోరీ చేయాలనుకున్న వారి ప్లాన్.. తెల్లవారే వరకు దాబాలోనే మద్యం సేవించేలా మారిపోయింది. ఉదయం సుమారు 8.30 గంటల సమయంలో దాబాను తెరవడానికి వచ్చిన యజమానికి లోపల కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారిగా షాక్ తగిలినంత పనైంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి ఓ వ్యక్తి మద్యం మత్తులో సోయి లేకుండా పడిపోయి ఉండగా.. మరో ఇద్దరు తీవ్ర మత్తులో కనిపించినట్లు సమాచారం. పోలీసులు అసలు విషయం ఏమిటని ప్రశ్నించగా.. ‘మేమే చేశాం’ అన్నట్లుగా వారి సమాధానాలు ఉండటంతో అక్కడున్న వారికి నవ్వాలో.. ఆశ్చర్యపోవాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. దొంగతనానికి వచ్చి పోలీసులకు చిక్కకుండా వెళ్లిపోవాల్సిన వారు.. మద్యం మత్తులోనే పోలీసులకు దొరికిపోవడం ఈ ఘటనలో అసలు ట్విస్ట్‌గా మారింది. ‘చోరీకి వచ్చి.. మందులో మునిగి.. చివరకు పోలీసులకు చిక్కారు’ అంటూ స్థానికులు సెటైర్లు వేసుకుంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేసి న్యాయం చేయాలని డాబా నిర్వాహకుడు కోరుతున్నాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి