పాలేరు పురోగతిలో పొంగులేటి ప్రస్థానం!
మంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : ప్రజాక్షేమమే పరమావధిగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డు స్థాయి పాలన అందిస్తోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దినేని బేబీ స్వర్ణకుమారి పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో శనివారం వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయ ఇన్‌ఛార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సత్యనారాయణ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
సంక్షేమ శకంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే పేదల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలతో ప్రతి కుటుంబానికి ఆర్థిక ఊరటనిచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిదేనన్నారు. తాజాగా శనివారం నుంచే లబ్ధిదారులకు ఉచిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టడం రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ నిబద్ధతకు అద్దం పడుతోందన్నారు.
పొంగులేటి నాయకత్వంలో సరికొత్త శకం.. రికార్డు స్థాయిలో ఇందిరమ్మ ఇండ్లు!
రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన మార్క్ పాలనతో దూసుకుపోతున్నారని నాయకులు ప్రత్యేకంగా కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదల సొంతింటి కలను నిజం చేసే 'ఇందిరమ్మ ఇండ్లు', భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే 'భూభారతి' పథకాలను పొంగులేటి తన సమర్థవంతమైన నాయకత్వంతో దిగ్విజయంగా పరుగులు తీయిస్తున్నారని ప్రశంసించారు. ముఖ్యంగా పాలేరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మోడల్‌గా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నారని స్పష్టం చేశారు. మౌలిక వసతులైన సీసీ రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్ సౌకర్యాలతో పాటు విద్యా, వైద్య రంగాలకు ఊపిరిపోస్తూ నియోజకవర్గ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేశారని తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుపుకోవడం పొంగులేటి దార్శనికతకు నిదర్శనమన్నారు.
ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ ఛైర్మన్ చావా శివరామకృష్ణ, ఏదులాపురం మున్సిపాలిటీ 6వ వార్డు కౌన్సిలర్ వేమిరెడ్డి శివదేవి వెంకట్‌రెడ్డి, నాయకులు ప్రతిభా రెడ్డి, షాహెలా జావేద్, మద్ది మల్లా రెడ్డి, మంగీలాల్, అర్వపల్లి శివకుమార్, లింగాల రవికుమార్, శ్రీకళా రెడ్డి, తిరుపతమ్మ, రమాదేవి, పద్మజా రెడ్డి, పద్మ, దుంపల రవి, ప్రతాపనేని రఘు, బట్టపోతుల సతీష్, పంతులు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి