ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

కాంగ్రెస్‌లోకి చేరికల జోరు.. మంత్రి పొంగులేటి చెస్ గేమ్ మొదలు పెట్టారా?


 ఎన్నికల ముందు కనిపించాల్సిన సీన్ ముందుగానే..

రాబోయే రాజకీయ ఎత్తుగడను చిత్తు చేసేందుకేనా?

‘నెక్స్ట్ ఎవరు?’ అంటూ ప్రతిపక్షాలను ఇరుకున పెడుతున్నారా?

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే ఖమ్మం రూరల్ మండలంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికల జోరు మొదలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపుతోంది. సాధారణంగా ఎన్నికలకు కొద్ది నెలల ముందు కనిపించే రాజకీయ వలసల *సీన్*.. ఇప్పటి నుంచే కనిపిస్తుండటంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారా? అనే చర్చ సాగుతోంది. పాలేరు నియోజకవర్గంలో మాస్ లీడర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత కూడా రాజకీయంగా తన పట్టును మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ వైపు రావడం వెనుక ముందస్తు రాజకీయ వ్యూహం ఉందా? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల సమయానికి ప్రతిపక్షాలు ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయబోతున్నాయో ముందుగానే పసిగట్టారా? అన్న ప్రశ్నకు ప్రస్తుత పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. ప్రత్యర్థులు తమ ఎత్తుగడలు సిద్ధం చేసుకునేలోపే.. కాంగ్రెస్ తన రాజకీయ బలాన్ని పెంచుకుంటూ వారికి అవకాశం లేకుండా చేయాలనే వ్యూహంతో ముందుకు సాగుతోందా? అనే చర్చ జరుగుతోంది. ఒకవైపు చేరికలతో కాంగ్రెస్ బలం పెరుగుతుండగా.. మరోవైపు ప్రతిపక్ష శిబిరాల్లో మాత్రం అంతర్మథనం మొదలైందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామస్థాయి నుంచి నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ వైపు కదులుతుండటం ఆయా పార్టీల భవిష్యత్ వ్యూహాలపై ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అసలు ఆసక్తికరమైన ప్రశ్న ‘నెక్స్ట్ ఎవరు?’ అన్నదే. ఇప్పటికే కొందరు నాయకులు కాంగ్రెస్ గూటికి చేరుతుండగా.. రాబోయే రోజుల్లో మరికొందరు కీలక నేతలు కూడా ఇదే బాట పడతారా? అన్న చర్చ పాలేరు రాజకీయాల్లో ఊపందుకుంది. అయితే ఈ చేరికల పరంపరను కేవలం సాధారణ రాజకీయ పరిణామంగానే చూడాలా.. లేక వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంత్రి పొంగులేటి ఇప్పటి నుంచే రాజకీయ  చెస్ బోర్డుపై పావులు కదుపుతున్నారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్షాల ఎత్తుగడ బయటకు రాకముందే దానికి ప్రతివ్యూహం సిద్ధం చేయడం.. రాజకీయంగా ఒక అడుగు ముందుండే ప్రయత్నమేనా? అన్న ప్రశ్నకు రాబోయే పరిణామాలే సమాధానం చెప్పనున్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది