దున్నుతుండగా రైతుకు కనిపించిన నవజాత శిశువు మృతదేహం
కూసుమంచిలో కలకలం.. 5–6 నెలల గర్భస్రావం అనంతరం వదిలివేసినట్లు అనుమానం
ప్రజాపక్షం/కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి గ్రామంలో పంట పొలంలో నవజాత శిశువు మృతదేహం లభ్యమవడంతో కలకలం రేగింది. గురువారం పొలం దున్నుతున్న సమయంలో రైతుకు పసికందు మృతదేహం కనిపించింది. దీంతో వెంటనే రైతు విషయాన్ని స్థానికులు, సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్ఐ నాగరాజు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయికుమార్ మృతదేహాన్ని పరిశీలించారు. ప్రాథమిక పరిశీలనలో సుమారు 5 నుంచి 6 నెలల గర్భస్రావం అనంతరం పసికందును పొలంలో వదిలివేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే పసికందు మృతదేహం అక్కడికి ఎలా వచ్చింది? ఎవరు వదిలి వెళ్లారు? అనే కోణాల్లో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. వైద్య పరీక్షలు, పోలీసుల దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మరోవైపు పంట పొలంలో పసికందు మృతదేహం లభ్యమైందన్న విషయం తెలియడంతో పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి