ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

వైరాలో సాగు నీటి "వార్"


రిజర్వాయర్‌ నీళ్ల చుట్టూ పార్టీల పోరు

అధికార కాంగ్రెస్... బిఆర్ఎస్ ,సిపిఎం, ఎల్ పార్టీ మాస్ లైన్ మధ్య వార్

నీటి విడుదలకు ఆదేశాలు లేవంటున్న అధికారులు

ప్రజా పక్షం/వైరా: వైరా రిజర్వాయర్‌లో ప్రస్తుతం సుమారు 16.7 అడుగుల నీటి సామర్థ్యం ఉండగా, రిజర్వాయర్‌ ఆయకట్టు పరిధిలో దాదాపు 18 వేల ఎకరాల్లో సాగు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సాగునీటి విడుదలపై వైరాలో అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, సీపీఎం, ఎంఎల్‌ పార్టీ మాస్‌లైన్‌ మధ్య రాజకీయ వేడి రాజుకుంది. రిజర్వాయర్‌ నుంచి నీటిని విడుదల చేయవద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవు అని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ.. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటిని విడుదల చేయాలని అఖిలపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఆదివారం అఖిలపక్ష పార్టీల సమావేశం జరిగిన అనంతరం అదే రోజు రాత్రి సుమారు 12 గంటల సమయంలో రిజర్వాయర్‌ గేట్లను కొంతమేర ఎత్తి నీటిని విడుదల చేశారు.దీంతో సోమవారం అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఐబీ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. వైరా రిజర్వాయర్‌ కుడి, ఎడమ కాలువలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తారా? లేదా? అనే విషయంపై నీటిపారుదల శాఖ అధికారులు అధికారికంగా ప్రకటన చేయాలని నాయకులు డిమాండ్‌ చేశారు. నీటిని విడుదల చేయడం లేదంటే ఆ విషయాన్ని కూడా స్పష్టంగా ప్రకటించాలని కోరారు.అయితే ప్రభుత్వం నుంచి అధికారికంగా నీటి విడుదలకు ఆదేశాలు లేవని అధికారులు చెబుతున్నప్పటికీ.. అనధికారికంగా కొంత నీటిని విడుదల చేస్తున్నట్లు ఆందోళనకారులకు వివరించినట్లు తెలుస్తోంది. అనంతరం రిజర్వాయర్‌ నుంచి నీటి ప్రవాహాన్ని మరికొంత పెంచే విధంగా నీటిని విడుదల చేశారు.

నీళ్లపై రాజకీయ మాటల యుద్ధం...

సాగునీటి విడుదల వ్యవహారం ఇప్పుడు వైరాలో రాజకీయ పోరుగా మారింది. అధికార కాంగ్రెస్‌ నేతలు పై. బీఆర్‌ఎస్‌, సీపీఎం, ఎంఎల్‌ పార్టీ మాస్‌లైన్‌ నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శలు చేస్తు, రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించాల్సిందేనని అఖిలపక్షం పట్టుబడుతున్నాయి. మరోవైపు రిజర్వాయర్‌లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు. అయితే నీటిపారుదల శాఖ అధికారులు మాత్రం ప్రభుత్వం నుంచి నీటి విడుదలకు అధికారిక ఆదేశాలు లేవని పదేపదే స్పష్టం చేస్తున్నట్లు నాయకులు పేర్కొంటున్నారు.ఇటీవల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన అఖిలపక్ష రైతుల సమావేశంలోనూ నీటిపారుదల శాఖ ఈఈ నీటిని విడుదల చేయడం సాధ్యం కాదని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు నీటి విడుదల అంశం చుట్టూ అధికార పార్టీ, ప్రతిపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.

రైతుల ప్రయోజనమా.. రాజకీయ ఆధిపత్యమా?

వైరా రిజర్వాయర్‌ ఆయకట్టు కింద సుమారు 18 వేల ఎకరాల్లో పంటలు సాగులో ఉండటంతో రైతులకు సాగునీరు అత్యంత కీలకంగా మారింది. అధికారులు నిబంధనల ప్రకారం నీటిని విడుదల చేయడం సాధ్యం కాదంటుండగా, రాజకీయ పార్టీలు మాత్రం రైతుల కోసం నీటిని విడుదల చేయాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నాయి.‘అధికారులు ఆదేశాలు లేవంటున్నారు. అయినా నీటిని విడుదల చేస్తున్నాం’ అని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటుండగా, ‘రాజకీయ ప్రకటనలు కాదు.. పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరు అందించే అధికారిక ఉత్తర్వులు కావాలి’ అని మరో వర్గం డిమాండ్‌ చేస్తోంది.దీంతో వైరా రిజర్వాయర్‌ నీళ్లు ప్రస్తుతం కేవలం ఆయకట్టు పంటలకే కాకుండా రాజకీయ పార్టీల మధ్య ఆధిపత్య పోరుకు కూడా కేంద్రబిందువుగా మారాయి. రిజర్వాయర్‌లో నీటి లభ్యత, ప్రభుత్వ ఆదేశాలు, రైతుల అవసరాలు.. ఈ మూడింటిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే నీటి రాజకీయం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది