ఎస్సై కాళ్లపై పడి కన్నీరు పెట్టిన వృద్ధ రైతు.. గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు
ప్రజా పక్షం/వైరా: వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలోని పంటలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ సోమవారం వైరాలోని నీటిపారుదల శాఖ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్, సీపీఎం, ఎంఎల్ పార్టీ మాస్‌లైన్ ఆధ్వర్యంలో రైతులు, అఖిలపక్ష నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఆందోళన సమయంలో నీటిపారుదల శాఖ డీఈ నాగబ్రహ్మం కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా రైతులు, నాయకులు అడ్డుకుని నీటి విడుదలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ పరంగా నీటిని విడుదల చేయడానికి తనకు ఎలాంటి ఆదేశాలు లేవని డీఈ చెప్పడంతో నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదేశాలు లేకపోతే గత రాత్రికి రాత్రి కొద్దిమేర నీటిని ఎందుకు విడుదల చేశారని, రైతులను ఎందుకు అయోమయానికి గురిచేస్తున్నారని ప్రశ్నించారు.ఈ సమయంలో లింగన్నపేట రెవెన్యూ పరిధికి చెందిన ఓ వృద్ధ రైతు తన పొలాన్ని దమ్ము చేసుకున్నా నీరు లేక ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తూ వైరా ఎస్సై పుష్పాల రామారావు కాళ్లపై పడి కన్నీరుమున్నీరయ్యాడు. రైతు దుస్థితిని చూసిన అక్కడున్న వారు చలించిపోయారు. వెంటనే స్పందించిన ఎస్సై రామారావు రైతును లేపి, ‘‘పెద్దమనిషి.. అలా కాళ్లపై పడకండి. మీకు న్యాయం జరిగేలా చూస్తాం’’ అంటూ ధైర్యం చెప్పారు.అనంతరం అఖిలపక్ష నాయకులు, రైతులతో కలిసి ఎస్సై రామారావు డీఈ నాగబ్రహ్మంతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ ప్రభుత్వ నుంచి అధికారికంగా నీటిని విడుదల చేయాలన్న ఆదేశాలు లేవని, జిల్లా కలెక్టర్ నీటిని విడుదల చేయొద్దని సూచించారని తెలిపారు. అయితే రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అనధికారికంగా నీటిని విడుదల చేసి సహకరిస్తామని చెప్పినట్లు నాయకులు తెలిపారు. కొద్దిసేపటి అనంతరం నీటిపారుదల శాఖ సిబ్బందితో కాలువ గేట్లను ఎత్తించి నీటిని విడుదల చేశారు. దీంతో ఆందోళనకు దిగిన రైతులు కొంత ఉపశమనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు భూక్య వీరభద్రం, కట్టా కృష్ణార్జునరావు, లాల్మియా, బాణాల వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ సాగునీటి విషయంలో తమకు ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదన్నారు. రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువల కింద సాగు చేస్తున్న రైతులకు పంటలకు సరిపడా నీరు అందించడమే తమ లక్ష్యమన్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలని, లేనిపక్షంలో రైతులతో కలిసి మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కట్టా కృష్ణార్జున రావు ,భూఖ్య వీరభద్రం ,లాల్మియా , బాణాల వెంకటేశ్వరరావు, సిరిపురం సర్పంచ్ శెట్టిపల్లి శ్రీనివాసరావు, సుంకర సుధాకర్ ,మద్దెల రవి ,గుడిమెట్ల రజిత, బట్ట భద్రయ్య ,సుంకర సుధాకర్, తోట నాగేశ్వరరావు,అప్పం సురేష్, తూము సుధాకర్, మరికంటి శివ ఏదునూరి శ్రీనివాసరావు విలాసాగరం నరేష్ ,కందుల ఓంకార్ ,కంచర్ల నాగేశ్వరావు, తన్నీరు నాగేశ్వరావు ,వేముల శివకుమార్, వల్లభి శ్రీనివాసరావు ,గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు


కామెంట్‌ను పోస్ట్ చేయండి