ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

నీటి రాజకీయం సిగ్గుచేటు.. రైతులు సంయమనం పాటించాలి



 వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్

వైరా ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని ఎమ్మెల్యేకు పార్టీల నేతలు, రైతుల వినతి

ప్రజాపక్షం/వైరా: వైరా ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ, గోదావరి జలాలు వైరా రిజర్వాయర్‌కు వస్తున్న విషయం తెలిసే రాజకీయ లబ్ధి కోసం కొందరు నీటి రాజకీయం చేయడం సిగ్గుచేటని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్‌నాయక్ అన్నారు. రైతుల ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని సూచించారు. వైరా ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని కోరుతూ ఆదివారం కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ నాయకులతో పాటు పలు గ్రామాల రైతులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాందాస్‌నాయక్‌ను కలిశారు. ఈ సందర్భంగా సాగునీటి పరిస్థితిపై వారితో ఎమ్మెల్యే సుదీర్ఘంగా చర్చించారు. సీతారామ ఎత్తిపోతల పథకం రెండో దఫా మోటార్లను శనివారం ప్రారంభించి గోదావరి జలాలను వైరా, లంకాసాగర్ ప్రాజెక్టులకు తరలిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. సోమవారం రాత్రికి గోదావరి జలాలు వైరా చేరే అవకాశం ఉందన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో ఈ చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం తాగునీటికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అయినప్పటికీ వైరా ఆయకట్టులో కొంతమంది రైతులు పంటలు సాగు చేసినందున వాటిని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని చెప్పారు. తాను నెల రోజులుగా వైరా ఆయకట్టుకు నీరు అందించేందుకు కృషి చేస్తున్నానని, ఆ విషయాన్ని విస్మరించి తనపై విమర్శలు చేయడం సరికాదన్నారు. గోదావరి జలాలు వైరాకు వస్తున్న విషయం తెలిసిన తర్వాత కూడా కొందరు రాజకీయ పార్టీల నాయకులు ఆందోళనలకు పిలుపునివ్వడం రాజకీయ స్వలాభం కోసమేనని విమర్శించారు. రైతులు ఆందోళనకు గురికాకుండా సంయమనం పాటించాలని, సంఘటితంగా ఉండి మనోధైర్యంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే కోరారు. రైతుల పంటలను కాపాడేందుకు తనవంతు కృషి కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్‌ఫెడ్ మాజీ వైస్‌చైర్మన్ బొర్రా రాజశేఖర్, ఏఎంసీ చైర్మన్ బొళ్ళ గంగారావు, ఆత్మ చైర్మన్ మట్టూరి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు శీలం చంద్రశేఖర్‌రెడ్డి, వీరంశెట్టి సీతారాములు, దొడ్డా పుల్లయ్య, సూతకాని జైపాల్, కౌన్సిలర్లు పణితి సైదులు, శ్రీకాంత్, టీడీపీ నాయకులు చెరుకూరి చలపతిరావు, మోత్కూరి వెంకటేశ్వరరావు, బొల్లెపల్లి శ్రీనివాసరావు, మండడపు మధుసూదన్‌రావు, సీపీఐ నాయకులు ఎర్రా బాబు, యామాల గోపాలరావు, సర్పంచ్‌లు మేడూరి రామారావు, గద్దల నర్సింహారావు, పూసలపాడు సొసైటీ అధ్యక్షుడు గాలి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم