ఎదులాపురంలో ఘనంగా ముత్యాలమ్మ వేడుకలు



 డప్పు కొట్టిచ్చిందేసిన సీపీఐ కౌన్సిలర్లు, నాయకులు

పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించిన మహిళలు

ప్రజాపక్షం/ ఖమ్మం రూరల్: ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎదులాపురంలో శ్రావణ మాస ముత్యాలమ్మ బోనాల వేడుకలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బొడ్రాయి సెంటర్‌ నుంచి ముత్యాలమ్మ ఆలయం వరకు బోనాలతో ర్యాలీగా తరలివచ్చారు. సంప్రదాయబద్ధంగా అమ్మవారికి బోనాలు, ప్రసాదాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో సీపీఐ 28వ వార్డు కౌన్సిలర్ దండి రంగారావు, 32వ వార్డు కౌన్సిలర్ మామిండ్ల శ్రీనాథ్‌రెడ్డి స్వయంగా డప్పులు వేసి ఉత్సాహం నింపారు. 30వ వార్డు కౌన్సిలర్ దండి శ్రీజ డప్పుల దరువులకు చిందులేస్తూ వేడుకల్లో సందడి చేశారు. సీపీఐ నాయకులు, కార్యకర్తలు సైతం డప్పులు కొడుతూ ర్యాలీలో పాల్గొనడంతో పరిసర ప్రాంతం సందడిగా మారింది. మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలతో ర్యాలీగా తరలిరావడంతో ముత్యాలమ్మ ఆలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ వేడుకలు ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగాయి. ఈ ప్రాంత చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున తరలి రావడం ఓరి ఐక్యతకు నిదర్శనంగా నిలిచిందంటూ వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మిడ కంటి చిన్న వెంకటరెడ్డి, సిపిఐ జిల్లా సమితి సభ్యుడు చెరుకుపల్లి భాస్కర్, ఐఏఎల్ జాతీయ సమితి సభ్యుడు ఓరుగంటి శేషగిరి, నాయకులు పెద్ద వెంకటరెడ్డి , రామిడి రమేష్ , వెన్నం భాస్కర్, గణపారపు నాగయ్య , దొంతగాని వెంకన్న, గణపారపు ఉపేందర్, వెంపటి సురేందర్, పొన్నెకంటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

28వ వార్డులో ఘనంగా...

ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులో శ్రావణమాసం సందర్భంగా ముత్యాలమ్మ అమ్మవారి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ కౌన్సిలర్ దండి రంగారావు వేడుకల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి తీర్థ ప్రసాదాలను సమర్పించి, భక్తులు స్వీకరించారు. సంప్రదాయ ఆచారాల్లో భాగంగా జంతు బలి కార్యక్రమం కూడా నిర్వహించారు. ముత్యాలమ్మ అమ్మవారి నామస్మరణతో వార్డులో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో వేడుకలు సందడిగా, భక్తిశ్రద్ధల మధ్య కొనసాగాయి. 

تعليقات

المشاركات الشائعة