వైరా–మధిర రహదారిపై ప్రమాదాల పరంపర..
కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా? అధికారుల పర్యవేక్షణ లోపమా?
‘మరో ప్రాణం పోయే వరకు ఎదురుచూపులెందుకు?’’ అంటూ వాహనదారుల ఆగ్రహం
ప్రజాపక్షం /వైరా: రెండు సంవత్సరాలు గడిచినా రోడ్డు పనులు పూర్తి కాకపోవడం ఇప్పుడు వైరా ప్రజలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వైరా మున్సిపాలిటీ పరిధిలోని రింగ్ రోడ్డు నుంచి మధిర వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఏర్పడిన భారీ గుంతలు వాహనదారులకు ప్రాణసంకటంగా మారాయి. రోడ్డుపై ఎక్కడ చూసినా గుంతలే కనిపిస్తుండటంతో రాత్రి వేళ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించుకోవడానికి ప్రయత్నించే క్రమంలో వాహనాలు అదుపుతప్పి ఢీకొంటున్న ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే పలువురు గాయపడగా, కొందరు కాళ్లు విరిగే స్థాయిలో ఆస్పత్రుల పాలయ్యారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండున్నరేళ్ల జాప్యానికి కారణమేంటి?
ఒక రహదారి నిర్మాణానికి నిర్ణీత గడువు, నాణ్యతా ప్రమాణాలు, అధికారుల పర్యవేక్షణ ఉండాలి. కానీ ఈ రహదారి పనులు ఇంతకాలం సాగుతున్నా పూర్తి కాకపోవడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయి? కాంట్రాక్టర్‌కు విధించిన గడువు ఎంత? గడువు ముగిసినా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇప్పటివరకు కాంట్రాక్టర్‌కు ఎలాంటి నోటీసులు, జరిమానాలు విధించారు? పనుల నాణ్యతను ఎన్నిసార్లు తనిఖీ చేశారు? అనే ప్రశ్నలకు అధికారుల నుంచి స్పష్టమైన సమాధానాలు రావాల్సి ఉంది.
అధికారుల పర్యవేక్షణ ఎక్కడ?
ప్రజల ప్రాణాలకు సంబంధించిన ప్రధాన రహదారి ఇంత అధ్వానంగా మారినా సంబంధిత శాఖ అధికారులు ఎందుకు వెంటనే స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు రోడ్డును క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉంటే ప్రమాదకర గుంతలు ఇంతకాలం కొనసాగేవా? తాత్కాలికంగా గుంతలను పూడ్చి ప్రమాదాలను నివారించే చర్యలు ఎందుకు చేపట్టలేదు? అన్నది ప్రజల ప్రశ్న.
రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా?
కాంట్రాక్టర్ అధికార పార్టీకి చెందినవారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. ఒకవేళ కాంట్రాక్టర్‌పై రాజకీయ ప్రభావం ఉంటే, అధికారులు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నారనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. రాజకీయ సంబంధాలు పనుల నాణ్యత, ప్రజల భద్రత కంటే పైస్థాయిలో ఉండకూడదని పలువురు అంటున్నారు.
బిల్లులు విడుదలయ్యాయా? నాణ్యత తనిఖీలు జరిగాయా?
ఈ వ్యవహారంలో అసలు కీలకమైన ప్రశ్నలు ఇవే. ఇప్పటివరకు పనులకు ఎంత మొత్తంలో నిధులు మంజూరయ్యాయి? ఎంత ఖర్చు చేశారు? కాంట్రాక్టర్‌కు ఏ మేరకు బిల్లులు చెల్లించారు? చెల్లింపులకు ముందు నాణ్యతా పరీక్షలు జరిగాయా? నిర్మాణంలో ఉపయోగించిన మెటీరియల్‌పై నాణ్యతా పరీక్షలు నిర్వహించారా? పనులు పూర్తికాకుండానే ఏమైనా చెల్లింపులు జరిగాయా? అనే అంశాలపై అధికారులు పారదర్శకంగా వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉంది.
మరో ప్రమాదం కోసం ఎదురుచూస్తున్నారా?
ప్రస్తుతం రహదారి పరిస్థితిని చూస్తే ప్రమాదం జరగడానికి ఒక్క క్షణమే చాలు అన్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, రాత్రివేళ ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ శాశ్వత పరిష్కారం ఎందుకు కనిపించడం లేదనే ప్రశ్న ప్రజలను వేధిస్తోంది. ప్రజల ప్రాణాలకు ముప్పు ఉన్న రహదారిపై వెంటనే అధికారులు ప్రత్యేక బృందంతో తనిఖీ నిర్వహించి, పనుల జాప్యానికి కారణాలను బహిర్గతం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఎమ్మెల్యే జోక్యం చేసుకోవాలని డిమాండ్
వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి రహదారి పరిస్థితిని పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. కాంట్రాక్టర్ పనితీరు, అధికారుల పర్యవేక్షణ, నిధుల వినియోగం, నిర్మాణ నాణ్యత, పనుల గడువు తదితర అంశాలపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రజల ప్రశ్న ఒక్కటే—రోడ్డు పూర్తవ్వడానికి ఇంకా ఎంతకాలం? మరో ప్రమాదం జరిగి ప్రాణం పోయిన తర్వాతే చర్యలు తీసుకుంటారా?


إرسال تعليق