యడ్లపల్లి సందీప్ జ్ఞాపకార్థం రూ.70 వేల రూపాయలతో వంటగది వితరణ.
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎం. వెంకటాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ. 70 వేల వ్యయంతో వంటగదిని నిర్మించి వితరణగా అందించారు. గ్రామ మాజీ సర్పంచ్ గుర్రం అచ్చయ్య–ధనమ్మల మనవడు యడ్లపల్లి సందీప్ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందారు. ఆయన జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు పాఠశాలకు వంటగదిని నిర్మించి అందించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారీకి వంటగది లేక ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలో ఈ సదుపాయం కల్పించడం పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి. శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుర్రం అచ్చయ్య మాట్లాడుతూ.. సందీప్ జ్ఞాపకార్థం విద్యార్థులకు ఉపయోగపడే సేవా కార్యక్రమం చేపట్టడం సంతృప్తినిచ్చిందన్నారు.ప్రతి నెల విద్యార్థులకు వివిధ రకాల అంశాలపై వ్యాసరచన ఉపన్యాసం క్వీజ్ మొదలగు పోటీలు నిర్వహించి, గెలుపొందిన విద్యార్థులకు 1500 వందల రూపాయలు అందించడం జరుగుతుందని అన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు దాతలు, గ్రామస్థులు ముందుకు రావాలని కోరారు. రానున్న రోజుల్లో తన వంతుగా ప్రభుత్వ పాఠశాలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని తెలిపారు.
సేవా కార్యక్రమాలు ఆదర్శనీయం...
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని ప్రధానోపాధ్యాయుడు జి. శ్రీనివాసరావు అన్నారు. వంటగది నిర్మాణానికి సహకరించిన గుర్రం అచ్చయ్య కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే పాఠశాలలో పనిచేసి పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయురాలు కృపాభాయి విద్యార్థుల భోజన సౌకర్యం కోసం రూ.25 వేల విలువైన బల్లాలను అందించడం అభినందనీయమన్నారు. దాతల సహకారంతో పాఠశాలలో విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేగినాటి విజయ్‌కుమార్, ఉపసర్పంచ్ కొళ్లపూడి సుమతి, మందపల్లి నాగమణి, యడ్లపల్లి వెంకటరామయ్య, నండ్ర ప్రసాద్, బందెల వెంకయ్య, ఏఏపీసీ చైర్మన్ రెంటాల భాగ్యమ్మ, మందటి వెంకటరమణ, కుర్ర వెంకన్న,శీలం శ్రీనివాస్,రెంటాల నాగేశ్వరరావు, వార్డు సభ్యులు గుమ్మడి వీరబాబు, రెంటాల శివ, తోకల వెంకన్న, బేతంపూడి నాగరాజు, గుర్రం రమేష్, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.


إرسال تعليق