ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

అర్ధరాత్రి హత్య... వీడిన మిస్టరీ



 వృద్ధురాలి హత్య కేసును ఛేదించిన పోలీసులు

బంగారం కోసం హత్య.. ఆన్‌లైన్ బెట్టింగ్ ఉచ్చులో ప్రధాన నిందితుడు.. ఇద్దరు అరెస్ట్

ప్రజాపక్షం / తిరుమలాయపాలెం : జులై 17 అర్ధరాత్రి పిండిప్రోలు గ్రామంలో వృద్ధురాలు సుగుణ హత్యకు గురై తీవ్ర కలకలం రేపిన ఘటనలో పోలీసులు ఎట్టకేలకు మిస్టరీని ఛేదించారు. బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలిని హత్య చేసిన ప్రధాన నిందితుడితో పాటు అతడికి సహకరించిన మరో యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.. పిండిప్రోలు గ్రామానికి చెందిన ఐతనబోయిన ప్రశాంత్‌ (26) చికెన్ షాప్ నిర్వహిస్తున్నాడు. మద్యం సేవించడం, ఆన్‌లైన్ బెట్టింగ్ కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అతడు.. తన షాప్ సమీపంలో నివసించే వృద్ధ దంపతులను కొంతకాలంగా గమనిస్తున్నాడు. వృద్ధురాలు సుగుణ మెడలో బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించి వాటిని దోచుకోవాలని పథకం వేసుకున్నాడు. ఈ క్రమంలో జులై 17 అర్ధరాత్రి వృద్ధురాలి ఇంట్లోకి ప్రవేశించి బంగారు ఆభరణాలు దోచుకునే ప్రయత్నం చేయగా ఆమె ప్రతిఘటించింది. దీంతో వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో ఆమెపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆమె మెడలోని బంగారు చైన్, నల్లపూసల చైన్‌కు సంబంధించిన బంగారు బిళ్లలను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. హత్య అనంతరం దొంగిలించిన బంగారు చైన్‌ను తన వరుసకు బామ్మర్ది అయిన మహబూబాబాద్ జిల్లా మర్రిపెడ మండలం బాలినిధర్మారానికి చెందిన సరగండ్ల మహేష్‌ (20)కు ఇచ్చి బ్యాంకులో తనఖా పెట్టి డబ్బులు తీసుకురావాలని చెప్పాడు. మహేష్ ఖమ్మంలోని ఓ బ్యాంకులో బంగారు చైన్‌ను తన పేరుతో తనఖా పెట్టి రూ.1.50 లక్షల రుణం పొందినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితులను ఆదివారం ఉదయం తిరుమలాయపాలెం రోడ్డులో పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు.నిందితుల నుంచి  బిళ్లలు – 9, మొబైల్ ఫోన్లు – 2,నేరానికి ఉపయోగించిన ఇనుప రాడ్, ద్విచక్ర వాహనం, గోల్డ్ లోన్‌కు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు చేదనకు కూసుమంచి సీఐ సంజీవ్ ఆధ్వర్యంలో కే. జగదీష్, పి. సంతోష్, జె. నాగరాజు, హరికృష్ణ, ఎస్‌ఐ దివ్యతో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏసీపీ తెలిపారు. సమన్వయంతో దర్యాప్తు చేపట్టి నిందితులను త్వరితగతిన అరెస్ట్ చేసిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ప్రతిభ కనబరిచిన సిబ్బందికి రివార్డులు అందజేశారు. కేసుకు సంబంధించిన ఇతర అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని ఏసీపీ తిరుపతి రెడ్డి తెలిపారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم