కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండం కరుణాకర్
ప్రజాపక్షం/ ఖమ్మం రూరల్: కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారం, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం చేపట్టిన ‘అమరుల యాదిలో గీతన్నల చైతన్య బస్సు యాత్ర’ ముగింపు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండం కరుణాకర్ పిలుపునిచ్చారు. ఈ నెల 18న హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద నిర్వహించనున్న ముగింపు కార్యక్రమానికి గీత కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న రూ.20 కోట్ల ఎక్స్‌గ్రేషియా బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఈత, తాటి చెట్లకు నంబర్లు కేటాయించి వాటిని రక్షించే చర్యలు చేపట్టాలని సూచించారు. 560 జీవో ప్రకారం ప్రతి గీత కార్మికుల సొసైటీకి ఐదెకరాల భూమి కేటాయించి, అందులో పొట్టి వంగడాలను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, వాటికి సబ్సిడీ అందించాలని కోరారు. అలాగే ఆగస్టు 18న సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై సర్వాయి పాపన్న విగ్రహాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠించాలని కరుణాకర్ డిమాండ్ చేశారు.

إرسال تعليق