ఫీజు చెల్లించిన ప్లాట్లకు వెంటనే రిజిస్ట్రేషన్లు, భవన నిర్మాణ అనుమతులు ఇవ్వాలి
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఖమ్మం బిల్డర్స్ అసోసియేషన్ వినతి
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) ద్వారా వేలాది మంది ప్లాట్ యజమానులకు చట్టబద్ధమైన హక్కులు లభించాయని, అయితే LRS దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియడంతో ఇంకా దరఖాస్తు చేసుకోలేకపోయిన అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఖమ్మం బిల్డర్స్ అసోసియేషన్ పేర్కొంది. ఈ నేపథ్యంలో LRS దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం మరియు సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు తుంపాల కృష్ణమోహన్ గురువారం వినతిపత్రం సమర్పించారు.ప్రభుత్వం జారీ చేసిన మెమో కారణంగా గడువులోగా దరఖాస్తు చేసుకోలేకపోయిన వేలాది మంది ప్లాట్ యజమానులకు మరో అవకాశం కల్పించాలని కోరారు. అలాగే ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ జరిగిన అన్ని అర్హత కలిగిన ప్లాట్లకు LRS దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా, LRS ఫీజును పూర్తిగా చెల్లించిన ప్లాట్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేసి, భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేసేలా సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ నిర్ణయం అమలైతే వేలాది మంది ప్లాట్ యజమానులకు ఊరట లభించడంతో పాటు నిర్మాణ రంగానికి ఊతం లభిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఫీజులు, స్టాంప్ డ్యూటీ తదితర రుసుముల రూపంలో గణనీయమైన ఆదాయం సమకూరుతుందని అసోసియేషన్ అభిప్రాయపడింది. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తమ వినతిని సానుకూలంగా పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఖమ్మం బిల్డర్స్ అసోసియేషన్ కోరింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు మన్నేటి నాగేశ్వరరావు, తిప్పని రాజశేఖర్ రెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق