డీజేలు.. బాణసంచా.. కార్ల ర్యాలీలతో ఘన స్వాగతం
పెళ్లి ఊరేగింపును తలపించిన వినాయకుల ఆగమన వేడుకలు
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: వినాయక చవితి వేడుకలు ఖమ్మం రూరల్ మండలం, ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం ఆయా ప్రాంతాల్లో గణనాథులు కొలువుదీరడంతో పల్లెలు, కాలనీలు పండుగ శోభను సంతరించుకున్నాయి. వినాయక మండపాల నిర్వాహకులు భక్తిశ్రద్ధల నడుమ గణనాథులను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉండ్రాళ్లు, వివిధ రకాల నైవేద్యాలను సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.వినాయక మండపాల వద్ద ప్రత్యేక అలంకరణలు, విద్యుత్ దీపాలతో పాటు వివిధ ఆకృతుల్లో ఏర్పాటు చేసిన భారీ గణనాథుల ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా భక్తులు మండపాలకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
ఆగమనంలోనే కొత్త ట్రెండ్...
ఇప్పటివరకు వినాయక నవరాత్రుల అనంతరం జరిగే నిమజ్జన ఊరేగింపులే ప్రధాన ఆకర్షణగా ఉండేవి. డప్పుల మోతలు, డీజేలు, బాణసంచా నడుమ గణనాథులను నిమజ్జనానికి తరలించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి అందుకు భిన్నంగా వినాయకుల ఆగమనాన్నే ఓ వేడుకగా మార్చారు.మండపాల వద్దకు గణనాథులను తీసుకువచ్చే సమయంలో డీజేలు, బాణసంచా మోతలు, కార్ల ర్యాలీలతో నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. యువత డీజే పాటలకు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. కార్ల ర్యాలీలు, బాణసంచా మోతలతో ఆయా ప్రాంతాలు మార్మోగాయి.గణనాథుల ఆగమన వేడుకలు చూస్తుంటే పెళ్లి ఊరేగింపును తలపించేలా కనిపించాయి. సాధారణంగా నిమజ్జన సమయంలో కనిపించే సందడి ఈసారి ప్రతిష్ఠకు ముందే కనిపించడంతో భక్తుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. దీంతో ఈ ఏడాది వినాయక చవితి వేడుకల్లో ‘ఆగమన వేడుకలు’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి