రూ.20 లక్షలు ఇవ్వాలంటూ ఇద్దరు వ్యక్తులు వేధించారని సూసైడ్ నోట్‌లో
ప్రజాపక్షం/ముదిగొండ: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో పోక్సో కేసు నిందితుడు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముదిగొండకు చెందిన వినయ్ (పేరు) ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. సుమారు ఆరు నెలల క్రితం నమోదైన పోక్సో కేసులో వినయ్ జైలుకు వెళ్లగా, మూడు నెలల అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఇటీవల తనను ఇద్దరు వ్యక్తులు రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వేధిస్తున్నారని వినయ్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు వారు తెలిపారు. తనపై నమోదైన పోక్సో కేసులో కూడా తనను కావాలనే ఇరికించారని, ఆ తర్వాత డబ్బుల కోసం వేధింపులకు గురిచేశారని వినయ్ పేర్కొన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వేధింపులే తన ఆత్మహత్యకు కారణమని వారు ఆరోపించారు. సమాచారం అందుకున్న ముదిగొండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సూసైడ్ నోట్, అందులో పేర్కొన్న అంశాలు, డబ్బులు డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి